
ఉత్తమ ప్రైవేట్ టీచర్లకు అపుస్మా అవార్డులు
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (అపుస్మా) ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డుల పురస్కార కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూలోని బి.ఆర్.అంబేడ్కర్ హాల్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న 179 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా వారికి అవార్డులు అందజేశారు. వీరితో పాటు సుమారు 20 ఏళ్లుగా పాఠశాలలను నిర్వహిస్తున్న మరో 12 మందిని కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్య అనేది వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి అని తెలిపారు. అపుస్మా చీఫ్ మెంటర్ ఎ.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేని కోరారు. రీజనల్ అధ్యక్షుడు ఎం.వి.రావు, జిల్లా అధ్యక్షుడు ఎం.వి.వి.సత్యనారాయణ, యు.సురేశ్ కుమార్, శేషు, శ్రీనివాసరావు, ఎం.రాము నాయుడు, మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.