
నేడు బీజేపీ బహిరంగ సభ
ఎంవీపీకాలనీ: రైల్వేగ్రౌండ్ వేదికగా భారతీయ జనతా పార్టీ ఆదివారం బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. శనివారం లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి శ్రీనివాస్‌వర్మ, పార్టీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పధాధికారులు హాజరవుతారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని విజయవాడ వేదికగా రాష్ట్ర స్థాయి ఖాదీ సంత నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 17న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌పై వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మోద్దన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో జరుగుతున్నది ప్రైవేటీకరణ కాదు.. ప్రైవేట్ భాగస్వామ్యం మాత్రమేనని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు.