ఐక్యంగా ఉద్యమిస్తాం! | - | Sakshi
Sakshi News home page

ఐక్యంగా ఉద్యమిస్తాం!

Sep 14 2025 6:13 AM | Updated on Sep 14 2025 6:13 AM

ఐక్యం

ఐక్యంగా ఉద్యమిస్తాం!

విద్యుత్‌ ఉద్యోగ సంఘాల అల్టిమేటం

సాక్షి, విశాఖపట్నం: మాయమాటలతో అన్ని వర్గాలను మభ్య పెట్టి.. అందలమెక్కిన కూటమి ప్రభుత్వం.. విద్యుత్‌ ఉద్యోగుల నోట్లో కూడా మట్టి కొడుతోంది. తమ విజ్ఞప్తులు పట్టించుకోండంటూ చేసిన ఆర్తనాదాలు సర్కార్‌ చెవికెక్కడం లేదు. దీంతో విద్యుత్‌ ఉద్యోగులు ‘కూటమి’గా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఈపీడీసీఎల్‌లో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వారు.. ఎప్పటికై నా శాశ్వత ఉద్యోగి కాకపోతానా అని ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు.. ఇలా ప్రతి విభాగంలోనూ ఉద్యోగులు ఉద్యమించేందుకు నడుం బిగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామంటూ విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ ముందస్తు హెచ్చరికలు చేసింది. తాము నిర్దేశించిన గడువులోగా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అడుగులు వేయకపోతే దళల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొంది.

ఐదు ప్రధాన డిమాండ్లు సహా..

విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వానికి తమ డిమాండ్‌ నోటీసుతోపాటు ఆందోళన కార్యాచరణ వివరాలను అందజేసింది. ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌కు డిమాండ్ల నోటీస్‌ను నేతలు అందజేశారు. ముఖ్యంగా ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఇంతవరకూ అమలు చేయని నిర్ణయాలతోపాటు సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న వృత్తి, ఉద్యోగ పరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఐదు ప్రధాన డిమాండ్లతోపాటు.. ఇతర డిమాండ్ల పరిష్కారానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.

జేఏసీ డిమాండ్లలో ప్రధానమైనవి..

● 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 మధ్యలో డిస్కంలో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలి.

● 1999 నుంచి 2004 మధ్య విధుల్లో చేరిన రాష్ట్ర వ్యాప్తంగా 5,311 మంది ఉద్యోగుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇందులో ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 1,573 మంది ఉండగా.. ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 347, జెన్‌కోలో 932, సీపీడీసీఎల్‌లో 835, ఎస్‌పీడీసీఎల్‌లో 1,623 మంది ఉద్యోగులు దీని కోసం ఎదురుచూస్తున్నారు.

● ప్రస్తుత ఉద్యోగులతోపాటు రిటైర్డ్‌ ఉద్యోగులకు గ్రూప్‌ మెడిక్లైమ్‌ పాలసీని అందుబాటులోకి తేవాలి.

● ట్రాన్స్‌కో, జెన్‌కోతోపాటు డిస్కంల పరిధిలో విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబానికి కారుణ్య నియామకాలు అమలు చేయాలి

● కాంట్రాక్ట్‌ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి.. థర్డ్‌ పార్టీ ద్వారా కాకుండా నేరుగా వేతనాలు అమలు చేయాలి. 2023 ఆగస్ట్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు సమానంగా ఉండాలి.

● డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని క్యాడర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం, పనిని దృష్టిలో పెట్టుకొని అదనపు పోస్టులు మంజూరు చేయాలి.

● పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను మంజూరు చేయాలి. తద్వారా వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని జేఏసీ స్పష్టం చేసింది.

ఉద్యమ కార్యాచరణ ఇలా..

ఈ నెల 15, 16 తేదీల్లో బ్లాక్‌ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు.

17, 18 తేదీల్లో అన్ని సర్కిల్స్‌ ప్రధాన కార్యాలయాలు, జెనరేటింగ్‌ స్టేషన్లలో లంచ్‌ సమయంలో నిరసన ప్రదర్శనలు.

19, 20 తేదీల్లో అన్ని సర్కిల్స్‌ ప్రధాన కార్యాలయాలు, జెనరేటింగ్‌ స్టేషన్లలో రిలే నిరాహార దీక్షలు.

22న శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ కలెక్టర్‌కు మెమొరాండం అందించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.

రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు

22 నాటికి దిగిరాకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

ఐక్యంగా ఉద్యమిస్తాం! 1
1/1

ఐక్యంగా ఉద్యమిస్తాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement