
కథక్.. కూచిపూడి.. కలరిపయట్టు
మద్దిలపాలెం: నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న 17వ వైశాఖీ నృత్యోత్సవాలు రెండో రోజైన శనివారం నేత్రపర్వంగా సాగాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారులు తమ అద్వితీయ ప్రదర్శనలతో ప్రేక్షకులను భక్తి, ఆధ్యాత్మిక భావనలతో ఓలలాడించారు. ముందుగా ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత కథక్ నృత్యకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షోవన నారాయణ్ ‘త్రయ దర్శనం’ పేరుతో చేసిన నృత్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. జీవాత్మ పరమాత్మలో విలీనం కావాలనే తపనతో సాగించే బహుమితీయ ప్రయాణాన్ని ఆమె తన నృత్యంతో కళ్లకు కట్టారు. ఓం: ది కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ క్రియేషన్, యశోధర త్యాగం వంటి అంశాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
శ్రీకృష్ణుని లీలామృతం పంచిన గీతా నారాయణ్
అనంతరం రాష్ట్రానికి చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారిణి గీతా నారాయణ్ సుదగాని.. శ్రీకృష్ణుని జీవన శైలిని, అవతార వైభవాన్ని నృత్యరూపకంగా ఆవిష్కరించారు. శ్రీకృష్ణుని వివిధ రూపాలను, రాధామాధవుల ప్రేమను, కృష్ణుని ఉల్లాసభరితమైన స్వభావాన్ని కళ్లకు కట్టి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అనంతరం కేరళకు చెందిన కె.వి.ముహమ్మద్ గురుక్కల్ బృందం ప్రదర్శించిన కలరిపయట్టు యుద్ధ విద్య ప్రదర్శన వీక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసింది. కత్తి యుద్ధ విన్యాసాలతో కూడిన ఈ ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ప్రదర్శనలకు ముందు విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి సుదగాని రవిశంకర్ నారాయణ్, విశ్రాంత చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ జె.సిరికుమార్, కళాభారతి అధ్యక్షుడు ఎం.ఎన్.ఎస్.రాజు, రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వి.వి.రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ నృత్యాలు మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలని, కళాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు. నిర్వాహకుడు బత్తిన విక్రమ్ గౌడ్‌ను అభినందించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సవ డైరెక్టర్లు సాయి వెంకటేష్, కాశ్మీరా త్రివేది, డా.సజని వల్లభనేని, ఎం.భారతి, జగబంధు జెనా, అనుపమ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కథక్.. కూచిపూడి.. కలరిపయట్టు

కథక్.. కూచిపూడి.. కలరిపయట్టు