
డి–పట్టా భూముల్లో తోటల తొలగింపు
తగరపువలస: భీమిలి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 101/1లో కూటమి ప్రభుత్వం మే ఫెయిర్ హోటల్‌కు కేటాయించిన 40 ఎకరాల్లోని డీ పట్టా భూముల్లో తోట పంటలను తొలగించే కార్యక్రమం నాలుగు రోజులుగా అధికారుల పర్యవేక్షణ మధ్య కొనసాగుతోంది. ఈ భూమిలో భీమిలి మండలం అన్నవరం పంచాయతీ పైలపేటకు చెందిన 28 మంది డ్వాక్రా మహిళలకు పాతికేళ్ల కిందట నాటి ప్రభుత్వం కార్పొరేట్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో భాగంగా 14 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు ఈ భూమిని కూడా మే ఫెయిర్ హోటల్ కోసం కేటాయించిన భూమిలో కలిపేశారు. ఈ భూములకు సంబంధించి భీమిలి తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని ఈ నెల 12న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ భూముల్లోని తోటలు తొలగించవద్దని కోర్టు ఆదేశించినప్పటికీ అధికారులు తమను అడ్డుకుంటున్నారని బాధిత మహిళలు అంటున్నారు.
రైతు కుటుంబాల ఆవేదన
మే ఫెయిర్ హోటల్‌కు కేటాయించిన 40 ఎకరాల్లోని భూమిలో భోగాపురం మండలం తూడెం పంచాయతీకి చెందిన మేకల కాపరులు, ఇతరులకు 1971 నుంచి 2000 వరకు డీపట్టాలు జారీ అయ్యాయి. ఈ పట్టాలు పొందిన వారిలో దువ్వి సూరి (డీఆర్ నంబర్ 271/79, 120/2000), దువ్వి రాములప్పడు (33/91, 123/2000), దువ్వి ఎర్రయ్య (129/2000), దువ్వి సూరమ్మ (130/2000), దంతులూరి అప్పలరాజు (492/1979) వంటి వారు ఉన్నారు. వీరికి సంబంధించిన పట్టాలను భీమిలి రెవెన్యూ అధికారులు జారీ చేసి ఫారం–3లో కూడా నమోదు చేశారు. ఈ భూమిని సాగుకు తప్ప విక్రయించరాదని రిజిస్ట్రార్ ముందు కూడా ఉంచారు. ఈ రైతులు భూమి శిస్తులు చెల్లించిన రసీదులు, జాయింట్ పట్టాలు, 10–1 అడంగల్ పత్రాలు కూడా కలిగి ఉన్నారు. ఏటా వీరు ఈ భూమిలో నీలగిరి, జీడిమామిడి, సరుగుడు తోటల నుంచి గణనీయమైన ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వం మొదట 18.70 ఎకరాలు మాత్రమే హోటల్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, తర్వాత 40 ఎకరాలు కేటాయించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది మే నుంచి రైతులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నట్లు 1526/2025 కేసులో హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.