
టీ–20 వరల్డ్ కప్‌కు గిరి పుత్రిక
పాడేరు రూరల్: ఓ మారుమూల గిరిజన గ్రామంలోని పేదరికం ఆమె ప్రతిభను అడ్డుకోలేకపోయింది. కంటిచూపు లోపం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. అకుంఠిత దీక్ష, పట్టుదలతో మన్యానికి చెందిన గిరిజన యువతి పాంగి కరుణకుమారి చరిత్ర సృష్టించింది. దేశంలో తొలిసారిగా జరగనున్న అంధుల మహిళా టీ–20 ప్రపంచ కప్‌కు ఎంపికై , మట్టిలో మాణిక్యంగా నిలిచింది. పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన పాంగి రాంబాబు, సంధ్య దంపతుల కుమార్తె కరుణకుమారి. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు, అన్నయ్య ఉన్నారు. పేదరికం కారణంగా మధ్యలోనే చదువు ఆపేసిన ఆమెను ఓ ఉపాధ్యాయుడు విశాఖపట్నం జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడ 10వ తరగతి చదువుతున్న కరుణకుమారిలోని క్రీడా నైపుణ్యాన్ని పాఠశాల పీఈటీ గుర్తించి ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కరుణ, ఏకంగా భారత జట్టులో స్థానం సంపాదించింది.
ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో..
నవంబర్ 11 నుంచి 25 వరకు న్యూఢిల్లీ, బెంగళూరు వేదికగా ఈ ప్రతిష్టాత్మక టీ–20 ప్రపంచ కప్ టోర్నమెంట్ జరగనుంది. ఆతిథ్య భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అమెరికా జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. లీగ్ దశలో 21 మ్యాచ్‌లు, ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ కూడా పాల్గొంటున్నందున.. కొన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలైన నేపాల్ లేదా శ్రీలంకలో నిర్వహించే అవకాశం ఉంది.
ఆదుకోవాలంటున్న తల్లిదండ్రులు
తమ కుమార్తె అంతర్జాతీయ స్థాయికి ఎంపికవడంపై కరుణకుమారి తల్లిదండ్రులు రాంబాబు, సంధ్య ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తె ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రభుత్వం, దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కుమార్తెలాగే గిరిజన ప్రాంతాల్లో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారని, వారిని గుర్తించి ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కరుణకుమారి ఎంపిక పట్ల బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
భారత అంధుల జట్టుకు ఎంపికై న పాంగి
కరుణకుమారి
ఎండాడ అంధ బాలికల పాఠశాల విద్యార్థి