
కేసుల పరిష్కారంలో విశాఖ నాలుగో స్థానం
మెగా లోక్ అదాలత్ విజయవంతం
విశాఖ లీగల్: జాతీయ మెగా లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్‌ను విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ప్రారంభించి, రాజీమార్గమే రాజ మార్గం అని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 36 బెంచ్‌లను ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు. న్యాయవాదులు, సమాంతర న్యాయ సహాయకులు, న్యాయమూర్తులు అందిస్తున్న సేవలను ఆయన పర్యవేక్షించారు. ఈ మెగా లోక్ అదాలత్ ఉమ్మడి విశాఖ జిల్లాలోని విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా జరిగింది. ఈ సందర్భంగా సహాయం అందించిన న్యాయవాదులు, అధికారులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజు అభినందించారు. కాగా.. మోటారు ప్రమాద కేసుల్లో రెండు బెంచ్‌లు కలిపి 124 కేసులను పరిష్కరించారు. నష్టపరిహారం కింద రూ.4.40 లక్షలు చెల్లించారు. ది న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఒక కేసులో లబ్ధిదారునికి రూ.53 లక్షల చెక్కును ప్రధాన న్యాయమూర్తి అందజేశారు. అలాగే సివిల్ లో 185 కేసులు, క్రిమినల్‌లో 10,190 కేసులు, ప్రీ లిటిగేషన్‌లో 239 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు తెలిపారు. రాజీ మొత్తం విలువ దాదాపు రూ.25 కోట్లు అని, జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా జరిగిందని ఆయన వెల్లడించారు.