
రోబోటిక్ సర్జరీతో క్లిష్టమైన కణితుల తొలగింపు
ఆరిలోవ: డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌తో సంక్లిష్టమైన ప్యాంక్రియాటిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో శుక్రవారం సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ విశ్వబసు దాస్ తన వైద్య బృందంతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. జి.శేషగిరిరావు, కె.శుభమణి అనే ఇద్దరు రోగులు పెరియాంపుల్లరీ కణితులతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ కణితుల కారణంగా వారికి కామెర్లు, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు ఎదురైనట్లు వివరించారు. వారికి కేర్ ఆస్పత్రిలో డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సహాయంతో అత్యాధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, కణితులను విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స రాష్ట్రంలో ఇదే మొదటిసారన్నారు. సాధారణంగా ఈ సమస్యకు ఓపెన్ సర్జరీ అవసరమైనప్పటికీ, రోబోటిక్ విధానంలో చిన్న రంధ్రం ద్వారానే శస్త్రచికిత్స చేయవచ్చని వివరించారు. ఈ విధానం ద్వారా శస్త్రచికిత్స తక్కువ సమయంలో పూర్తైందని, అధిక రక్తస్రావం కూడా జరగలేదన్నారు.