
హెచ్‌ఎస్‌ఎల్‌కు షిప్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
సింథియా: హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌ఎల్) సంస్థ ‘షిప్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’అవార్డును అందుకుంది. భారత నౌకాదళం కోసం డైవింగ్ సపోర్ట్ నౌకను నిర్మించడంలో వినూత్న పద్ధతులను అవలంబించినందుకు గానూ హెచ్‌ఎస్‌ఎల్‌కు ఈ అవార్డు లభించింది. ముంబయిలో జరిగిన మారిటైమ్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ తరపున డిప్యూటీ జనరల్ మేనేజర్(ప్రొడక్షన్) ఆనంద్‌మోహన్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎస్‌ఎల్ అధికారులు మాట్లాడుతూ ఈ పురస్కారం తమకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడంలో, నౌకా నిర్మాణ ప్రాజెక్టులలో అద్భుతమైన పనితీరు కనబరచడంలో, షెడ్యూల్‌లో ఎదురైన క్లిష్టమైన సవాళ్లను అధిగమించి గొప్ప మైలురాళ్లను చేరుకోవడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా అత్యాధునిక నౌకా నిర్మాణ పరిష్కారాలను అందించడం ద్వారా సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హెచ్‌ఎస్‌ఎల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.