
మార్గశిర మాసోత్సవాలకు సన్నద్ధం కావాలి
డాబాగార్డెన్స్: మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సన్నద్దం కావాలని, ఇప్పటి నుంచే సంబంధిత అభివృద్ధి పనులు ప్రారంభించి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలని, నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని సూచించారు. శుక్రవారం ఆయన ఆకస్మికంగా ఆలయాన్ని తనిఖీ చేసి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా ధర్మ దర్శనం క్యూలతోపాటు ఇతర క్యూల ఏర్పాట్లను చూశారు. అన్న ప్రసాదం భోజనశాలను సందర్శించి అక్కడ వినియోగించే సరకులను, రికార్డులను తనిఖీ చేశారు. ఆలయ పరిసరాల్లో ఉన్న అన్ని ద్వారాల వద్ద గేట్లు, క్యూల పరిస్థితి తెలుసుకున్నారు. సంబంధిత మ్యాప్‌లు పరిశీలించారు.