
దుర్గానగర్ వద్ద రోడ్డు మూసివేత
● ఉక్కు యాజమాన్యం తీరుపై ప్రజల ఆందోళన ● కలెక్టర్ హరేందిరప్రసాద్ ఆగ్రహం ● గంటల వ్యవధిలో కంచె తొలగింపు
గాజువాక : గంగవరం పోర్టు వై జంక్షన్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ వరకు గల ప్రధాన రహదారిని దుర్గానగర్ జంక్షన్ వద్ద స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మూసివేసింది. అక్కడ ఒక రైతుతో ఏర్పడిన భూవివాదంలో కోర్టు నుంచి రైతుకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడటంతో స్టీల్‌ప్లాంట్ ఈ చర్యలకు దిగింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దశాబ్దాల తరబడి మనుగడలో ఉన్న రోడ్డును మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ బి.శ్రీనివాసరావు ఆ కంచెను గంటల వ్యవధిలో తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. పాతకర్ణవానిపాలెం నుంచి స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే రహదారిలో దుర్గానగర్ వద్ద సర్వే నంబర్ 215లోని వివిధ సబ్ డివిజన్లలో కొంత భూమిని అప్పట్లో స్టీల్‌ప్లాంట్ తీసుకోలేదు. ఇప్పటికీ అది జిరాయితీగానే ఉంది. అయినప్పటికీ అందులో స్టీల్‌ప్లాంట్ రోడ్డు నిర్మించింది. ఆ భూమి తనదని, తనకు నష్టపరిహారం ఇవ్వకుండా రోడ్డు వేయడం సరికాదంటూ వెంకట రమణ అనే వ్యక్తి హైకోర్టును 2021లో ఆశ్రయించాడు. నిబంధనల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ఆ సమస్య అలాగే ఉండటంతో ఆ వ్యక్తి మరోసారి కోర్టును ఆశ్రయించాడు. స్టీల్‌ప్లాంట్ సీఎండీపై కోర్టు ధిక్కరణ కేసు వేశాడు. దీంతో ఆ రోడ్డు తమకు అవసరం లేదని పేర్కొంటూ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దుర్గానగర్ వద్ద రోడ్డును మూసివేసింది. పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి, ఫార్మాసిటీ వంటి ప్రాంతాలకు ఇది దగ్గర మార్గం కావడంతో ప్రజలు వేల సంఖ్యలో ఈ రోడ్డులోనే రాకపోకలు సాగిస్తారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులతోపాటు ఆ సంస్థకు వచ్చే భారీ వాహనాలు కూడా ఆ రోడ్డే ఉపయోగపడుతోంది. దుర్గానగర్ సమీపంలోని వివిధ అపార్ట్‌మెంట్‌వాసులకు, వివిధ లాజిస్టిక్ కంపెనీలు ఈ రోడ్‌ను ఉపయోగిస్తాయి. ఎంతో ఉపయోగకరమైన ఈ రోడ్డును మూసివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తహసీల్దార్ పరిశీలన
స్టీల్‌ప్లాంట్ రోడ్డును మూసివేయడంతో కలెక్టర్ హరేందిరప్రసాద్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు గాజువాక తహసీల్దార్ బి.శ్రీనివాస్ ఆ రోడ్డును పరిశీలించారు. పూర్తి వివరాలను స్థల యజమానిని అడిగి తెలుసుకొని కలెక్టర్‌కు నివేదించారు. రోడ్డును అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశించడంతో అడ్డంగా వేసిన కంచెను శనివారం రాత్రి తొలగించారు. అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ తెలిపారు.