
మేయర్ ఇంటి సమీపంలో బెల్ట్ దుకాణం
50 మద్యం క్వార్టర్ బాటిళ్ల స్వాధీనం
పెందుర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు నివాసానికి కూత వేటు దూరంలో శుక్రవారం అర్ధరాత్రి ఓ మద్యం బెల్ట్ దుకాణం బాగోతం బయటపడింది. వివరాలివి..ఆనందపురం మండలం శొంఠ్యాం గ్రామానికి చెందిన ఎర్ర మాధవ్ పెందుర్తి కూడలి సమీపంలోని డీఆర్‌సీ షాపింగ్ మాల్ ఎదురుగా మద్యం బెల్ట్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సీఐ కేవీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో దుకాణంపై మెరుపుదాడి చేశారు. దుకాణంలో ఉన్న 50 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన నిందితుడు మాధవ్‌ను హెచ్‌సీ జి.అప్పారావు, పీసీ చంద్రశేఖర్ చాకచక్యంగా పట్టుకుని అదుపులోనికి తీసుకున్నారు. సీఐ సతీస్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.