కూటమి మాస్టర్‌ ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి మాస్టర్‌ ప్లాన్‌

May 16 2025 12:43 AM | Updated on May 16 2025 12:43 AM

కూటమి మాస్టర్‌ ప్లాన్‌

కూటమి మాస్టర్‌ ప్లాన్‌

● ఈ నెల 22 నుంచి జూన్‌ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ● ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట ● వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్‌ ● నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు?

ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా?

ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను, అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్‌ ప్లాన్‌ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్‌’ ప్లాన్‌ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది.

2021లోనే మాస్టర్‌ ప్లాన్‌ పూర్తి

వీఎంఆర్‌డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ లీ అసోసియేట్స్‌కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌పై దృష్టి సారించింది. మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన సమయంలో వీఎంఆర్‌డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్‌డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్‌ 8న వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌–2041కు అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ..

మళ్లీ అభ్యంతరాల స్వీకరణ

వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్‌లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్‌ ప్లాన్‌–2041ను సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్‌ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్‌ ప్లాన్‌– 2041లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్‌లైన్‌ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్‌ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement