
విశాఖ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటట్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న(సోమవారం) రేపల్లెలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది.