
నాణ్యతే ప్రామాణికం..అవగాహనే కీలకం
● వస్తువులు కొనుగోలు చేసేటప్పడు జాగ్రత్తలు పాటించాలి ● కొలతల్లో మోసాలు జరిగితే అధికారులను సంప్రదించాలి ● నేడు ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం
తాటిచెట్లపాలెం: వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులు పొందడం ఎంత ముఖ్యమో, వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉండటం కూడా అంతే కీలకం. కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించడంతో పాటు, వాటి తయారీ, కొలతలు, ధర వంటి వివరాలపై అవగాహన పెంచుకుంటే మోసాల నుంచి బయటపడొచ్చు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులోనూ తూనికలు, కొలతల విషయంలో జాగ్రత్త వహించాలని లీగల్ మెట్రాలజీ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కే థామస్ రవికుమార్ సూచించారు. మంగళవారం ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1875లో పారిస్‌లో జరిగిన మీటర్ కన్వెన్షన్‌కు గుర్తుగా ఈ దినోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం లీగల్ మెట్రాలజీ 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2025 లీగల్ మెట్రాలజీ డే ‘కొలతలు అన్ని కాలాలకు – అందరు ప్రజలకు’ నినాదంతో సాగుతుంది. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ విభాగం ఈ నెల 8 నుంచి 19 వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవగాహన శిబిరాలు, తనిఖీలు నిర్వహించింది. ఆయా ప్రాంతాలలో వస్తువులను కొనుగోలు చేసేటపుడు ప్రజలు ఎలా మోసపోతారో, ప్రజలను వ్యాపరులు ఎలా మోసగిస్తారో వివరించారు. తూనికలు, కొలతలు, ప్యాకేజీ వస్తువుల విషయంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు.
బంగారు ఆభరణాల విషయంలో...
బంగారు ఆభరణాలు కొనేటప్పుడు రాళ్లు, బంగారం వేర్వేరుగా తూకం వేస్తున్నారో లేదో చూడాలి. బిల్లులో నికర బరువు, ధర, స్వచ్ఛత వివరాలు పరిశీలించాలి. కొనుగోలు సమయంలో మిల్లీగ్రాము వరకు ఖచ్చితత్వమున్న ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను, వాటికి లీగల్ మెట్రాలజీ సీల్ ఉందో లేదో గమనించాలి.
పెట్రోలు బంకుల్లోనూ..
పెట్రోల్, డీజిల్ కొనే ముందు పంప్ మీటర్ 0 తో మొదలయ్యేలా చూడాలి. సరైన ధర చెల్లిస్తున్నారో లేదో గమనించాలి. అనుమానం ఉంటే, పెట్రోల్ బంకుల్లో ఉండే లీగల్ మెట్రాలజీ సీల్ ఉన్న ఐదు లీటర్ల కొలత పాత్రతో పరిమాణం సరిచూసుకోవాలి.
ప్యాకేజీ వస్తువుల విషయంలో..
ప్యాకేజీ వస్తువులు కొనే ముందు బరువు, కొలత, తయారీ తేదీ, గరిష్ట అమ్మకపు ధర, కస్టమర్ కేర్ వివరాలు చూడాలి. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేస్తే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు, బస్ స్టాండ్‌లు, సినిమా థియేటర్‌లు, హోటళ్లు, మార్కెట్‌లు, కిరాణా, సూపర్ మార్కెట్‌లలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు.
2024–25 సంవత్సరంలో లీగల్ మెట్రాలజీ గణాంకాలు...
జిల్లాలో నమోదు చేసిన కేసులు – 1500
స్టాంపింగ్ ఫీజు – రూ.2,34,88,983
కాంపౌండింగ్ ఫీజు (అపరాధరుసుము/ జరిమానాలు)– రూ.1,16,75,710

నాణ్యతే ప్రామాణికం..అవగాహనే కీలకం

నాణ్యతే ప్రామాణికం..అవగాహనే కీలకం