
పల్లా శ్రీనివాసరావుపై న్యాయపోరాటం
● అన్ని పార్టీల మద్దతు కోరతా ● ఎమ్మెల్యే పదవి నుంచి గాజువాక ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి ● తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్
తాటిచెట్లపాలెం: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై అన్ని పార్టీల మద్దతుతో న్యాయపోరాటం చేస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. తాను వ్యక్తిగతంగానే పోరాడుతున్నానని, ఈ పోరాటానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా తదితర పార్టీల మద్దతు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం హోటల్ సింకా గ్రాండ్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా? అని రామ్ ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్ తనపై హత్యాయత్నం చేశారని, గాజువాకలో భూకబ్జాల మాఫియాకు మారుపేరుగా పల్లా శ్రీనివాస్ నిలిచారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడి విషయమై గాజువాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని, పోలీస్ కమిషనర్‌ను కూడా కలిశానని, ఆయనపై నమ్మకం ఉందన్నారు. పల్లా శ్రీనివాసరావుపై సీబీఐ, కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేశానని రామ్ తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని భావించానని, కానీ టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. పల్లా శ్రీనివాసరావు దగ్గర ఉండే మురళీ అతని వ్యవహారాలన్నీ చూస్తూ సెటిల్‌మెంట్లు, కలెక్షన్స్ చేస్తుంటాడని ఆరోపించారు. అన్ని పార్టీలతో కలిసి న్యాయపోరాటం చేస్తానని, ఈ విషయమై ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిశానని, కాంగ్రెస్ నాయకులను కలిశానని, త్వరలోనే వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్టులు, లోక్‌సత్తా నాయకులను కలుస్తానని రామ్ తెలిపారు. ప్రాణ రక్షణ కోసం తనకు గన్ లైసెన్స్ ఇప్పించాలని పోలీస్ కమిషనర్‌ను కోరనున్నట్లు బీవీ రామ్ తెలిపారు.