
అర్జీల రీ ఓపెన్‌పై కలెక్టర్ అసంతృప్తి
● వచ్చే వారం అర్జీదారులతోస్వయంగా నేనే మాట్లాడతా ● అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ● కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 225 వినతులు
మహారాణిపేట: జిల్లాలో గ్రామ సభల్లోని సమర్పించిన అర్జీలు రీ–ఓపెన్ అవుతుండడంపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండిం గ్ అర్జీలపై సమీక్షించి, అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, కచ్చితమైన సమాచారంతో పొరపాట్లు లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు, అర్జీదారులు మీకోసం.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో లేదా 1100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం పీజీఆర్‌ఎస్ సందర్భంగా అధికారుల సమక్షంలో అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడతానని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లో తెరిచి, పూర్తిగా విచారణ చేసి, మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల సమస్యలు వింటూ, వాటిని సంబంధిత అధికారులకు పంపి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సోమవారం మొత్తం 225 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 91 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 18, జీవీఎంసీ సంబంధించి 51 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 65 వినతులు వచ్చాయి.