
కృత్రిమ ఆవాసాలు, సీ వీడ్‌కు మంచి గిరాకీ
మంత్రి అచ్చెన్నాయుడు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర సముద్ర జలాల్లో మత్స్య సంపద వృద్ధి కోసం మొదటి విడతగా 22 కృత్రిమ ఆవాసాల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాలారి ఎండాడ సముద్రంలో కృత్రిమ ఆవాసాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్‌లో మరపడవల బోట్లకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 634 ట్రాన్స్‌పాండర్లను 100 శాతం సబ్సిడీపై అందజేసినట్లు తెలిపారు. ట్రాన్స్‌పాండర్ల వాడకం వల్ల సముద్రంలో బోటు స్థానాన్ని తెలుసుకోవడం, తుఫానులు, ప్రమాదాల సమయంలో ఉపయోగపడుతుందని చెప్పారు. మత్స్యకారులకు జీపీఎస్, బోట్లు, ఇంజన్లు, వలలు వంటి పరికరాలను సబ్సిడీపై సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. ఫిషింగ్ హార్బర్‌లో క్రేన్, క్రెడిల్స్ ఏర్పాటుకు పోర్టు చైర్మన్‌తో మాట్లాడతానని చెప్పారు. ఆర్కే బీచ్ ఎదురుగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్, సీ వీడ్ కల్చర్ యూనిట్‌ను మంత్రి సందర్శించారు. వసీవీడ్‌కు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 22 సీవీడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 45 రోజుల్లోనే ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. కేజ్ కల్చర్ ద్వారా మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవచ్చని, సీవీడ్‌ను ఆధారం చేసుకుని చిన్న పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు, సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కిజాకుద్దీన్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, మాజీ అధ్యక్షుడు పీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సీ కేజ్ అమ్మకాలు ద్వారా వచ్చిన రూ.3.25 లక్షల చెక్కును లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.