
రెగ్యులర్ vs ఎయిడెడ్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు మళ్లీ రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్సిటీలోని కొంతమంది ఆచార్యులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి, పాలనలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసుపై ఏయూకు వచ్చిన అధ్యాపకుల పట్ల వర్సిటీలోని ఓ వర్గం వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. 1000 మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం 140 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే కాలేజీల్లో పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సేవలను వినియోగించుకోవాల్సింది పోయి.. తామేదో పరాయి దేశం నుంచి వచ్చినట్లుగా, వెళ్లిపోండంటూ కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎయిడెడ్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. క్యాంపస్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లతో మంగళవారం జరిగిన వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఓ వర్గం ఇదే అంశంపై పట్టుబట్టడం.. ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది.
రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో మల్లగుల్లాలు
ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో నిర్ణయం తీసుకున్నందున ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఇందుకు అనుమతించారు. కాగా.. ఎయిడెడ్ అధ్యాపకుల రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది నచ్చక దాదాపు 40 మంది వెనక్కి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృ సంస్థకు వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఎయిడెడ్ నుంచి వచ్చిన అధ్యాపకులు పనిచేస్తున్నారు. క్యాంపస్ కాలేజీల్లోని ఆయా విభాగాల్లో తరగతుల నిర్వహణలో వీరంతా కీలకంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి
పంపించేయాలని ఓ వర్గం పట్టు
వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఇదే చర్చ
పాఠాలు పక్కన పెట్టి.. పెత్తనంపై ఆరాటం
ఏయూలో అధ్యాపకుల తీరుపై విమర్శలు
తెరపైకి హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేలా ఓ వర్గం ఒత్తిడిచేస్తూనే ఉంది. కానీ ఫారిన్ సర్వీసుపై వచ్చినందున 2026 జూన్ వరకు వారికి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. వర్సిటీనే వేతనాలు చెల్లిస్తున్నందున, వారి సేవలను కొనసాగించాలనుకుంటున్నారా? లేదా? అంటూ మార్చిలో హయ్యర్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఇక్కడి అధికారులకు లేఖ రాశారు. వందేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని వర్సిటీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన వర్సిటీలోని ఓ వర్గం ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాల్సిందేనని ప్రస్తుత వైస్ చాన్సలర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు.
ఖాళీల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా?
రాష్ట్రంలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో టీచింగ్ 10 మంది, నాన్ టీచింగ్ 20 మంది అవసరం ఉందని, ఆన్ డ్యూటీ బేసిస్/ఫారిన్ సర్వీసు కింద పనిచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేశారు. ఇది తమకు కొంత ఊరటనిచ్చే విషయమేనని ఏయూలో ఫారిన్ సర్వీసు కింద పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులు అంటున్నారు. అయితే ఆయా యూనివర్సిటీలు 2025–26 విద్యా సంవత్సరానికి తమ అవసరాల మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడం బట్టి, ఇప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్ ఖాళీల భర్తీపై దృష్టి సారించే ఆలోచనలో లేదని అర్థమవుతోంది.