మొయినాబాద్: మహానగర శివారుల్లోని మొయినాబాద్ శరవేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. మొన్నటి వరకు గ్రామీణ వాతావరణం ఉన్న ఈ ప్రాంతం పట్టణీకరణగా మారుతోంది. అదే వేగంతో పోలీసు విభాగం సైతం దీనిపై దృష్టి సారించింది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొయినాబాద్ డివిజన్ (ఏసీపీ), అజీజ్‌నగర్ పోలీస్‌స్టేషన్, మొయినాబాద్ ట్రాఫిక్ పోలీస్‌ష్టేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చేవెళ్ల జోన్ (డీసీపీ) కార్యాలయాన్ని మొయినాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని సైతం మొయినాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్ఓటీ, ఏఆర్ విభాగాల కార్యాలయాలనూ ఇక్కడే ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని సైతం ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు కసరత్తు నడుస్తోంది.
ప్రజలకు అందుబాటులో ఉండేలా..
ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఇబ్రహీంపట్నంలోని వినోభానగర్‌లో కొనసాగుతోంది. ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కమిషనరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. కమిషనరేట్ కార్యాలయం తూర్పువైపు ఒక మూలకు ఉండటంతో పశ్చిమ ప్రాంతంలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మోకిల, మొయినాబాద్ ప్రాంతాలకు చాలా దూరంగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రజలు కమిషనరేట్‌కు వెళ్లాలంటే సుమారు 70–80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొయినాబాద్ పరిధిలో కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు స్థానికుల అభిప్రాయాలను సైతం తీసుకుంటున్నారు.
అనువైన భవనాలకోసం..
మొయినాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే డివిజన్ (ఏసీపీ) కార్యాలయం, అజీజ్‌నగర్ పోలీస్‌స్టేషన్, మొయినాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకోసం పోలీసు అధికారులు భవనాల అన్వేషణలో పడ్డారు. మరోవైపు కమిషనర్ క్యాంపు కార్యాలయం సైతం ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసే సన్నాహాలు జరుగుతుండడంతో అనువైన భవనాలకోసం వెతుకుతున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు. కమిషనర్ క్యాంపు కార్యాలయం మొయినాబాద్‌లోని ఐఐటీఏలో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నారు. డివిజన్ (ఏసీపీ) కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కోసం తహసీల్దార్ కార్యాలయం వెనకాల ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ భవనం, పెద్దమంగళారం శివారులో ఉన్న ఎస్సీ హాస్టల్ భవపనం పరిశీలనలో ఉన్నాయి. అజీజ్‌నగర్ పోలీస్స్టేషన్కోసం నాగిరెడ్డిగూడ పంచాయతీ కార్యాలయం, హిమాయత్‌నగర్‌లో ఉన్న వార్డు కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మరెక్కడైనా అనువైన భవనాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. దసరాకు అటూఇటుగా కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో భవనాలకోసం ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.
కమిషనర్ క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
కొత్తగా రానున్న మొయినాబాద్ డివిజన్, అజీజ్‌నగర్ పీఎస్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్
ఎస్ఓటీ, ఏఆర్ విభాగాల కార్యాలయాల ఏర్పాటు ఆలోచన
భవనాలకోసం మొదలైన అన్వేషణ
దృష్టంతా ఇక్కడే..
పోలీసు ఉన్నతాధికారులతోపాటు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖుల దృష్టంతా ఇప్పుడు మొయినాబాద్పైనే ఉంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయాల మధ్యలో ఉన్న ఇక్కడి ప్రాంతంలో ఇప్పటికే వేలల్లో ఫాంహౌస్‌లు, రిసార్ట్స్ వచ్చాయి. ప్రముఖులు, బడా బాబులకు చెందిన ఫాంహౌస్‌లు సైతం వందల్లో ఉన్నాయి. రిసార్ట్స్, కన్వెన్షన్లు పెరగడంతో అదేస్థాయిలో వేడుకలు, ఈవెంట్లు పెరిగిపోయాయి. ఇప్పటికే పలు విద్యా సంస్థలు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో క్రీడా ప్రాంగణాలు, గ్రౌండ్ల ఏర్పాటు భారీగానే ఉంది. దీంతో నిత్యం వేల మంది రావడం, వెళ్లడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నిఘా పెంచడంపై పోలీస్ విభాగం దృష్టి సారించింది. అందులో భాగంగా కొత్తగా మొయినాబాద్ డివిజన్, అజీజ్‌నగర్ పోలీస్‌స్టేషన్, మొయినాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.


