కుల్కచర్ల: చౌడాపూర్ మండల పరిషత్ కార్యాలయ అధికారిక కార్యక్రమాలు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఒక మండలానికి ఒకే ఎంపీడీఓ ఉంటారు. కానీ చౌడాపూర్ మండలానికి ప్రస్తుతం గత నాలుగు రోజులుగా ఇద్దరు అధికారులు ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రతీరోజు విద్యార్థులు బడికి వచ్చిపోయినట్లు వస్తూపోతూ ఉన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి సైతం ఇద్దరు హాజరై అర్జీలు తీసుకున్నారు. ఇదేలా ఉంచితే చౌడాపూర్ మండలంలో ఇద్దరు అధికారులు ఎంపీడీఓలుగా కొనసాగుతుండటం పట్ల పంచాయతీ కార్యదర్శులు, కిందిస్థాయి సిబ్బంది అయోమాయానికి గురవుతున్నారు. జిల్లా జెడ్పీ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు అధికారులు ఎంపీడీఒలుగా కొనసాగుతున్న ఆసక్తికర పరిస్థితి ఎర్పడింది.
తప్పెవరిదీ..?
చౌడాపూర్ మండలం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న సోమలింగం గత నెల 28న మెడికల్ సెలవులో వెళ్లి తిరిగి 7న విధుల్లో చేరారు. అప్పటి నుంచి మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్నారు. ఈ మధ్యకాలంలో బొంరాస్పేట్ సూపరిండెంట్ వెంకన్నకు ఇన్చార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇద్దరు అధికారులు కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో సిబ్బంది, ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు జెప్పీ సీఈఓకు పలుమార్లు ఫోన్ చేయగా స్పందించలేదు.
ఒకే మండలానికి ఇద్దరు అధికారులు


