నిప్పురవ్వలు ఎగిసిపడి ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

నిప్పురవ్వలు ఎగిసిపడి ఇల్లు దగ్ధం

Oct 13 2026 11:37 AM | Updated on Oct 13 2026 11:37 AM

యాలాల: ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగల నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో ఓ ఇల్లు కాలిపోయింది. ఈ ఘటన మండలంలోని రాస్నం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి బిచ్చమ్మ ఇంటిపై ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యుత్‌ తీగల నుంచి నిప్పురవ్వలు పడి కాలిపోయింది. గమనించి స్థానికులు గమనించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఇంట్లో ఉంచిన నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు కాలిపోయింది. బాధిత మహిళను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

కారును ఢీ కొన్న బస్సు

నలుగురికి గాయాలు

కొడంగల్‌ రూరల్‌: ముందు వెళ్తున్న కారును బస్సు ఢీ కొనడంతో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఉపేంద్ర చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నర్సింలు, రుక్కవ్వ, మధు కారులో కర్ణాటక రాష్ట్రం గుర్మిట్‌కల్‌ ఆయుర్వేద హాస్పిటల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులో కారును వెనుక నుంచి బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేంద్ర, నర్సింలుకు తీవ్ర గాయాలయ్యాయి. రుక్కవ్వ, మధులకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులకు తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.

గాయత్రి అలంకరణలో అమ్మవారు

మర్పల్లి: మండలంలోని తిమ్మాపూర్‌లో సోమవారం దుర్గామాత గాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలి అదృశ్యం

చేర దీసిన మియాపూర్‌ పోలీసులు

బంట్వారం: కోట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం తప్పిపోయింది. సదరు మహిళను మియాపూర్‌ పోలీసులు చేరదీశారు. ఆమె వివరాలు అడగ్గా.. తన పేరు రత్నమ్మ వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి గ్రామం అని తెలిపింది. వారు వెంటనే కోట్‌పల్లి ఠాణాకు సమాచారం అందించారు. కోట్‌పల్లి పోలీసులు రత్నమ్మ కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు మియాపూర్‌కు వెళ్లారు.

బ్రహ్మచారిణిగా

అమ్మవారి దర్శనం

అనంతగిరి: దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రెండో రోజు సోమవారం అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పట్టణంలోని వైభవలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

బాలిక అదృశ్యం

శంకర్‌పల్లి: తల్లిదండ్రులతో పాటే రాత్రి ఇంట్లో నిద్రించిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) పదో తరగతి ఫెయిలై ఇంటి వద్దే ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి నిద్రించింది. అర్థరాత్రి లేచి చూస్తే కూతురు కనిపించలేదు. ఇంట్లో, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రుధ్వీర్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement