● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
● పోలీసులకు తండ్రి ఫిర్యాదు ..
కేసు నమోదు
చేవెళ్ల: గుర్తు తెలియని వ్యక్తులు మానసిక పరిస్థితి బాగాలేని ఓ మహిళను తీసుకువచ్చి తీవ్రంగా గాయపరిచి చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద పడేసి వెళ్లిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శేరిలింగంపల్లి హఫీజ్‌పేట్‌లో ఉండే కల్సాని ఇంద్రారెడ్డి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన కూతురు వీణ (26)కు చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగ్గాలేదు. 2024లో వివాహం కాగా నెలలోనే విడాకులు అయ్యాయి. ఆమె మానసిక స్థితిపై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కూడా చేయించారు. అప్పటినుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఆమె తరచూ ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి మూడునాలుగురోజుల పాటు బయటకు వెళ్లిపోయి తిరిగి వచ్చేది. ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి తీవ్రంగా గాయపరిచి చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద పడేసి వెళ్లారు. స్థానిక రైతులు గమనించి పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదట రైతులు, పోలీసులకు ఆమె తన వివరాలు చెప్పకపోవడంతో పలు అనుమానాలు, పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిడ్నాప్‌చేసి అత్యాచారం, హత్యచేసేందుకు ప్రయత్నించి దూరంగా తీసుకు వచ్చి ఉంటారని అనుమానించారు. పోలీసుల విచారణలో ఆమె మానసిక స్థితి బాగాలేదని తెలింది.


