బస్సుల రద్దు.. ప్రయాణికుల పాట్లు | - | Sakshi
Sakshi News home page

బస్సుల రద్దు.. ప్రయాణికుల పాట్లు

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

అనంతగిరి: ఏళ్లనాటి నుంచి నడుస్తున్న బస్సుల సమయాల్లో మార్పులు, పలు సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వికారాబాద్‌ డిపో నుంచి రాష్ట్ర రాజధానికి రోజూ ఉదయం 4 గంటల నుంచి సర్వీసులు ప్రారంభమయ్యేది. 4.30.., 5.., 5.30 ఇలా ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచేది. ఇటీవల ఆర్‌టీసీ ఉన్నతాధికారులు 4.., 4.30.., 5 గంటల సర్వీసులను రద్దు చేశారు. ఉదయం 5.40గంటల నుంచి బస్సులను నడుపుతున్నారు. 5.30గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే సర్వీస్‌ వికారాబాద్‌కు వస్తుంది. తాండూరులోనే సీట్లన్నీ భర్తీ అవుతాయి. వికారాబాద్‌లో ఒక్క సీటు కూడా దొరకదు. ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌కు బస్సు బయలుదేరితే 6గంటలకు అక్కడికి చేరుకుంటుంది. 6.30గంటలకు తిరిగి బయలు దేరితే 9 – 9.30గంటల మధ్యలో వికారాబాద్‌కు వస్తుంది. నగరం నుంచి వికారాబాద్‌కు వచ్చే ఉద్యోగులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. ఈ సర్సీసును రద్దు చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగాలు చేసే వారు, ఉన్నత చదువులు చుదువుకునే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా తెల్ల వారుజామునే పది కిలో మీటర్ల దూరంలోని మన్నెగూడకు లారీలు, డీసీఎం వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్నారు. సాయంత్రం కూడా ఇదే తరహా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వికారాబాద్‌ డిపోకు చెందిన బస్సులు 8 గంటల వరకు హైదరాబాద్‌కు నడిచేవి. ప్రస్తుతం సాయంత్రం 5.30గంటల వరకే సర్వీసులు నడుస్తున్నాయి. ఆ తర్వాత తాండూరు డిపో బస్సులే దిక్కువతున్నాయి. అవి కూడా తాండూరులోనే ఫుల్‌ అయి రావడంతో వికారాబాద్‌ ప్రయాణికులు నిలుచుకోవడానికి కూడా అవకాశం ఉండటం లేదు. ఇలా వికారాబాద్‌ డిపో నుంచి నగరానికి 7 సర్వీసులను తగ్గించారు.

తెల్లవారుజాము సర్వీసులను రద్దు చేసిన ఆర్టీసీ అధికారులు

హైదరాబాద్‌ వెళ్లేందుకు ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలు

సాయంత్రం కూడా ఇలాంటి పరిస్థితులే

ప్రమాదమని తెలిసినా ప్రైవేటు వాహనాల్లో గమ్యాలకు..

అధికారుల తీరుపై మండిపడుతున్న జనం

4 గంటల నుంచే నడపాలి

వికారాబాద్‌ డిపో నుంచి హైదరాబాద్‌కు ఉదయం 4గంటల నుంచే బస్సులు నడపాలి. ఆ సమయంలో నగరానికి వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. 5.30 గంటల సర్వీస్‌ బయలుదేరుతుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌టీసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. సాయంత్రం కూడా సమయానుకూలంగా బస్సులు నడపాలి.

– మహిపాల్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement