జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలి

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

అనంతగిరి: ఓటు చోరీకి పాల్పడిన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌ జాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం వికారాబాద్‌లో ఆయన సీపీఎం, సీపీఐ, టీజేఎస్‌ జిల్లా ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్‌లో భారీ ర్యాలీ, నిరస కార్యక్రమం, దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ ఎన్‌టీఆర్‌, బీజేఆర్‌ చౌరస్తా మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు సాగుతుందన్నారు. ఎన్నికల కమిషనర్‌లోని ఇద్దరు సభ్యుల నిర్ణయాలను కాదని ఏకపక్షంగా బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ అధికారాలను ఆయన దుర్వినియోగం చేస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఫారం –6లో పార్లమెంట్‌లో బిల్లు లేకుండా ఎలా మార్పులు చేస్తారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుందని ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. మతంపేరుపై రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే ధర్నాకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, జిల్లా కమిటీ, అనుబంధ సంఘాలు, సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ సంతోష్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌చంద్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్‌, టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ సోమశేఖర్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పీర్‌ మహమ్మద్‌, నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement