దౌల్తాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం ఎంపీడీఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం మండల అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమచేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
అధిక ఫీజులు నియంత్రించాలి
అనంతగిరి: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ శివసాయి డిమాండ్ చేశారు. సోమవారం మండల విద్యాధికారి బాబుసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం, పుస్తకాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. సాయిచరణ్, రమేష్, శివకుమార్ పాల్గొన్నారు.
నూతనంగా తాగునీటి బోరు
దుద్యాల్: మండల పరిధి గౌరారం, దుద్యాల్ గ్రామాల్లో తాగునీటి సౌకర్యార్థం నూతనంగా బోర్లు వేశారు. నీటి ఎద్దడి నేపథ్యంలోపంచాయతీ నిధుల నుంచి బోరు వేసినట్లు నాయకులు తెలిపారు. దుద్యాల్ ఉప సర్పంచ్ మేరుగు సంజీవ్ కుమార్, కాంగ్రెస్ ఆయా గ్రామాల అధ్యక్షులు శ్రీశైల గౌడ్, కరుణాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, నాయకులు అంతు నాయక్, మల్లికార్జున్, వెంకటయ్య, వెంకటేశ్ గౌడ్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
సమస్య తీరదు.. దుర్గంధం తప్పదు
దుద్యాల్: మహబూబ్‌నగర్– తాండూరు రహదారి విస్తరణలో భాగంగా మండల పరిధి హస్నాబాద్ రోడ్డుకు ఇరువైపులా భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారు. కానీ.. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీల నుంచి వెలువడే మురుగును ఆ కాల్వలకు అనుసంధానం చేయలేదు. దీంతో ఆ వ్యర్థ జలాలు రోడ్డుపై పారుతూ.. వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. దుర్వాసన కూడా వస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామం నుంచి వచ్చే మురుగును ఆ కాల్వలకు కలిపి.. సాఫీగా ముందుకు సాగేలా చూడాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.


