● స్టాక్ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి
● కలెక్టర్ దీపక్ తివారీ
● పెట్రోల్ పంపు యాజమాన్యాలతో సమీక్ష
అనంతగిరి: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి పెట్రోల్ పంపు యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా, ధరల ప్రదర్శన, వినియోగదారులకు అందిస్తున్న సేవల నాణ్యతపై ఆరా తీశారు. ఇంధన సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్టాక్ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను స్పష్టంగా ప్రదర్శించడం, వినియోగదారులకు సరైన కొలతలతో ఇంధనం అందించడం, అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పెట్రోల్ పంపుల వద్ద తహసీల్దార్, పోలీస్ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసి అన్ని పెట్రోల్ పంపులను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాము నాయక్, డీఎస్‌ఓ సుదర్శన్, ఆర్టీఓ వెంకట్ రెడ్డి, పెట్రోల్ పంపుల యజమానులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలి
కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు పరిసరవాసులు సహకరించాలని కలెక్టర్ దీపక్ తివారీ కోరారు. బుధవారం ఆయన కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డితో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి నిర్మాణాలు కోల్పోతున్న వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. టీటీడీ తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి ప్రభుత్వం నూతన భవనాలను నిర్మంచనున్నట్లు వివరించారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న వారు ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.


