సాక్షి, సిటీబ్యూరో: అడుగడుగునా సామాజిక సవాళ్లు.. అయినా వారిలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ, ఉన్నతంగా జీవించాలనే కాంక్ష..! ఇదీ ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి. అందుకే, వారి అభ్యున్నతికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... వివిధ రంగాల్లో మార్కెట్ అవసరాలకు తగ్గట్లు సాంకేతికత, నైపుణ్య శిక్షణ ఇస్తోంది. వ్యవసాయం, సర్వేయింగ్, పారిశ్రామికంగా డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందున ఆ డిమాండ్‌ను తీర్చేందుకు ట్రాన్స్‌జెండర్లకు డ్రోన్ పైలెట్ శిక్షణ ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా.. బేగంపేటలోని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ)లో మొదటి బ్యాచ్‌లో 16 మందికి తర్ఫీదు ఇచ్చింది. ఇప్పటికే మెట్రో, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో పనితీరుతో గుర్తింపు తెచ్చుకుంటున్న ట్రాన్స్‌జెండర్లు... అతి త్వరలో పైలెట్లుగా డ్రోన్ రంగంలోనూ అడుగు పెట్టనున్నారు.
డీజీసీఏ లైసెన్స్..
జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, టైలరింగ్, వాహనాల డ్రైవింగ్ వంటి శిక్షణకే ట్రాన్స్‌జెండర్లు పరిమితమయ్యేవారు. ఏ విభాగంలోనైనా ఉద్యోగాలకు ప్రయత్నించినప్పుడు ప్రత్యేకంగా నైపుణ్యం ఉందా అనే ప్రశ్న ఎదురవుతుంది. అందుకే సాంకేతిక శిక్షణ అవసరమని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, టాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ గుర్తించింది. ఈ మేరకు డ్రోన్ పైలెట్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సేవల్లో సుశిక్షిత అభ్యర్థులకు జెండర్‌తో సంబంధం ఉండదు. అందుకే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ సహా పలు జిల్లాల నుంచి 16 మంది ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేసి డ్రోన్ పైలెట్‌లో శిక్షణ ఇచ్చారు. డ్రోన్ ఫ్లయింగ్ నిబంధనల నుంచి మొదలుపెట్టి, పైలెట్ శిక్షణ, ఉపకరణాల బిగింపు, స్పేర్ పార్ట్స్ తొలగింపు, స్టిమ్యులేషన్ దాక అన్ని దశల్లో శిక్షణ సాగింది. అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లైసెన్స్, టీఎస్‌ఏఏ సర్టిఫికేషన్‌తో అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా డ్రోన్ పైలెట్ చేసేందుకు అర్హులు.
తెలంగాణ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ
దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ట్రెయినింగ్
డీజీసీఏ లైసెన్స్‌తో దేశంలో ఎక్కడైనా పైలెట్‌గా అవకాశం
ఇప్పటివరకు మెట్రో, హైడ్రా, ట్రాఫిక్ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లు
త్వరలోనే పైలెట్స్‌గా డ్రోన్స్ విభాగంలోనూ వీరి సేవలు
డిమాండ్ ఉన్న రంగం
ట్రాన్స్‌జెండర్లు లాభదాయకమైన ఉపాధిని పొందకుండా పలు సామాజిక అవరోధాలున్నాయి. డ్రోన్ పైలెట్ శిక్షణ అనేది సాంకేతిక నైపుణ్యత. దీనిని అందిచడంలో టీఎస్‌ఏఏ భాగమైనందుకు సంతోషంగా ఉంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగం కావడంతో త్వరలోనే వారు ఉపాధి పొందుతారని ఆశిస్తున్నాం.
–దినకర్ దేవిరెడ్డి, హెడ్, తెలంగాణ ఏవియేషన్ అకాడమీ


