ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలి

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలి డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌ బదిలీ నీట్‌ పరీక్షా కేంద్రాల పరిశీలన మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఉద్యానశాఖ హెచ్‌ఈఓ బాబ్యానాయక్‌

కొడంగల్‌ రూరల్‌: రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యానశాఖ హెచ్‌ఈఓ బాబ్యానాయక్‌ సూచించారు. బుధవారం మండల పరిధిలోని పర్సాపూర్‌ రైతువేదికలో సర్పంచ్‌ కన్నం రాధాశ్రీనివాస్‌రెడ్డి అధ్యక్ష్యతన జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, ఇంకో ఫామ్‌ఆయిల్‌, ఫాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంబయ్యగౌడ్‌, ఏకో ఫామ్‌ మేనేజ్‌మెంట్‌ సంజయ్‌సోని, వికారాబాద్‌ ఏరియా మేనేజర్‌ రాము పంట సాగులో ప్రభుత్వ సబ్సిడీలు, మార్కెటింగ్‌, దిగుబడి గురించి రైతులకు వివరించారు. టేకుల్‌కోడ్‌ గోవర్దన్‌రెడ్డి ఆయిల్‌పామ్‌ గురించి తన అనుభవాలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పలువురు ఫారెస్టు అధికారుల బదిలీల్లో జ్ఞానేశ్వర్‌ను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కాగా వికారాబాద్‌కు ఇంకా ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వలేదు.

అనంతగిరి: మే 3వ తేదీన నీట్‌ పరీక్ష నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కేంద్రాలను అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లలోని మౌలిక వసతులు, తదితరాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాలన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను తనిఖీ చేసాకే సెంటర్లలోకి అనుమతించాలని సూచించారు.

ఉరి వేసుకుని దుర్మరణం

స్టేషన్‌ధారూరులో ఘటన

ధారూరు: వికారాబాద్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్టేషన్‌ధారూరు గ్రామంలో ఉదయం 9:30 గంటలకు చోటుచేసుకుంది. సీఐ రఘురామ్‌, ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్‌ధారూరుకు చెందిన డెగావత్‌ రాములునాయక్‌, గమినిబాయిల కూతురు తులసి(23) కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె అన్న రాజు వికారాబాద్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాజు పనిచేస్తున్న చోటే నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన పద్దుల మౌనిక ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తూ తులసి, రాజుకు చెందిన రూమ్‌లో ఏడాదిగా కలిసి ఉన్నారు. రాజు, మౌనిక మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాజు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో మౌనిక రూమ్‌ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయింది. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు వివాహం కుదిర్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న రాజు.. మౌనికతో దిగిన ఫొటోలను పెళ్లి కొడుకుకు పంపించినట్లు సమాచారం. దీంతో ఈనెల 27న మౌనిక తన కుటుంబ సభ్యులతో వచ్చి రాజుతో పాటు తులసిపై వికారాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. రాజు తనను వెంటాడి టార్చర్‌ చేస్తున్నాడని, తులసి ఇందుకు సహకరిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎస్‌ఐ తులసిని పీఎస్‌కు పిలిపించగా అక్కడే ఉన్న మౌనిక, అతని సోదరుడు మధు, స్నేహితుడు శేఖర్‌ ఆమెను బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తులసి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు మౌనికపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement