కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. మహ్మదాబాద్ మండలం గాధిర్యాల్‌కు చెందిన మధు తన సొంత ట్రాక్టర్‌లో అనంతసాగర్ వాగు నుంచి ఇసుక తరలిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు చూపించాలని అడగగా లేవని చెప్పడంతో వాహనాన్ని సీజ్ చేసి, పీఎస్‌కు తరలించారు.
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు
మాడ్గుల: మండల కేంద్రంలోని వివిధ పెట్రోలు బంక్‌లను మంగళవారం తహసీల్దార్ వినయ్‌సాగర్ తనిఖీ చేశారు. పెట్రోల్ బంక్‌లలో పెట్రోలు, డీజిల్ కొరత నేపథ్యంలో నిల్వలను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్‌ను వాహనాలలో మాత్రమే పోయాలని, బ్యారెల్స్, డబ్బాలలో నింపరాదని సూచించారు. అలాగే నిర్వాహకులు సకాలంలో డీడీలు చెల్లించి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువచ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు.
కారు ఢీకొని ఇద్దరు మృతి
యాచారం: అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాడ్గుల్ మండలం కొర్రతండాకు చెందిన కొర్ర జాను(47), కొర్ర నర్షా(39) వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకునేవారు. ప్రస్తుతం తమ పొలాల్లోని తాటి చెట్లకున్న మంజలు కోసి, నగరంలోని ఇంజాపూర్ చెరువు కట్టపైకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం 10 గంటలకు ఆటోలో ముంజలతో వెళ్లి, రాత్రి 8:30 గంటలకు తిరిగి వెళ్తున్నారు. ఈక్రమంలో సాగర్ హైవేపై యాచారం పీఎస్ సమీపంలోని మాల్ నుంచి అతి వేగంగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాన్, నర్షాలను మాల్, మాన్యగూడలోని ప్రవేట్ ఆస్పత్రులకు తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ రాత్రే మృతిచెందారు. నర్షాకు భార్య సబితతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. జాన్‌కు భార్య సరోజతో పాటు కొడుకు, కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని నందివనపర్తికి చెందిన కొర్రమోని వెంకటేశ్(38) మూడు రోజుల క్రితం నగరం నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, చౌదర్‌పల్లి గేట్ వద్ద ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌ను నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య సంగీత ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
బంజారాహిల్స్: యజమానుల కళ్లుగప్పి పనిమనుషులు చేతివాటం ప్రదర్శించి 20 తులాల బంగారు నగలతో ఉడాయించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని గఫార్‌ఖాన్ కాలనీలో నివసించే విజయ ఎస్.నాయక్ అనే మహిళ ఇంటి డ్రెస్సింగ్ రూమ్‌లోని అల్మరాను ధ్వంసం చేసి రెండు జతల బంగారు గొలుసులు, వజ్రాలతో కూడిన బ్రాస్‌లెట్, జత బంగారు రూబీ గాజులు, పొడవైన బంగారు గొలుసు, నెక్లెస్, ఆరు బంగారు గాజులను తస్కరించారు. తమ ఇంట్లో చాలాకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఇద్దరు పనిమనుషులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పనిమనుషుల కదలికలపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.


