● ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ
● హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు,
జూపల్లి కృష్ణారావు, డీజీపీ, స్థానిక నేతలు
కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీలో ఒక్కో సంస్థ కొలువుదీరనుంది. ఫ్యూచర్‌సిటీ ప్రాంతంలో ఇప్పటికే ఎఫ్‌సీడీఏ, స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణాలతో పాటు 330 అడుగుల రహదారి నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వాటితో పాటు ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట రెవెన్యూలో 25 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, డీజీ మహేశ్‌భగవత్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎల్‌ఆర్, తీగల కృష్ణారెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సుమతి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటీవ్ సువర్ణ, సీపీలు సుధీర్‌బాబు, రమేష్ తదితరులు హాజరయ్యారు. పోలీస్ కమీషనరేట్ భవనానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ రెండేళ్లు సహకరిస్తే ప్రపంచంలోనే అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయని సీఎం అన్నారు. ఫ్యూచర్‌సిటీలో ఏ కార్యక్రమం జరిగినా ఆ పరిధిలోని ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించాలని కలెక్టర్, డీసీపీలను ఆదేశించారు. పేదల పట్ల మానవనీయ కోణంతో మెలగాలని, రైతులతో చర్చించి ప్రభుత్వానికి అవసమైన భూములు ఇచ్చేలా లోకల్ నాయకుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి పక్కనే ఉన్న గ్రామాలను కూడా చేర్చాలని వినతులు వస్తున్నాయని, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


