అలసత్వాన్ని ఉపేక్షించం | - | Sakshi
Sakshi News home page

అలసత్వాన్ని ఉపేక్షించం

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

మర్పల్లి: విధి నిర్వహణలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ దీపక్‌ తివారి హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొత్లాపూర్‌, ఘణాపూర్‌ గ్రామాల్లో అభివృద్ధి పనులను, మర్పల్లి కమ్యూనిటీ ఆస్పత్రి, హెల్త్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది రిజస్టర్‌, వార్డులు, వైద్య పరికరాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఇంద్రసేనారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నరు. సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చొరవ చూపాలని ఆదేశించారు. ఎక్స్‌రే యంత్రం పాడైందని, అంబులెన్స్‌ లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడాలని సర్పంచ్‌ రామేశ్వర్‌కు, హౌసింగ్‌ సిబ్బందికి సూచించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి నిర్మాణ దశలో ఉన్న అదనపు తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. సర్పంచ్‌ గ్రామ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని, అట్టి భూమిని స్వాధీనం చేసుకొని పంచాయతీకి అప్పగిస్తే గోదాం నిర్మించుకుంటామని సర్పంచ్‌ కోరారు. స్పందించిన కలెక్టర్‌ కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి లక్ష్మికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులను గుర్తించండి

అనంతగిరి: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. ఇందుకు కోసం గెజిటెడ్‌ అధికారుల వెరిఫికేషన్‌ యూజర్‌ మాన్యువల్‌ విడుదల చేసినట్లు వివరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన వెరిఫికేషన్‌ యూజర్‌ మాన్యువల్‌ ద్వారా నిజమైన అర్హులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎటువంటి లోపాలు లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ సయ్యద్‌ ముక్రం బాబా, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

టెలికాం కమిటీ సమావేశం

కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం కలెక్టర్‌ దీపక్‌ తివారీ అధ్యక్షతన జిల్లాస్థాయి టెలికాం కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో టెలికాం సేవల విస్తరణ, నెట్‌వర్క్‌ నాణ్యత, ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్‌ సదుపాయంపై సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన టెలికాం సేవలు అందించడంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్‌ ప్రసాద్‌, ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుటుర్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌ రెడ్డి, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌, టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందాలి

ఇందిరమ్మ ఇళ్లనుసకాలంలో పూర్తి చేయాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement
 
Advertisement
Advertisement