మహేశ్వరం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా చెక్కులు అందించాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డ పెళ్లి విషయంలో ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ మహిళలు, గర్భిణులు, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ఎంపీడీఓ శైలజ, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఆర్‌ఐ స్వర్ణకుమారి పాల్గొన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


