ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం రాత్రి సీజ్‌ చేశారు. మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామానికిచెందిన అలవోని తిరుపతి.. తన వాహనంలో రాకొండ వైపునకు ఇసుక తీసుకెళ్తుండగా.. నమ్మదగిన సమాచారంతో పోలీసులు ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని ఠాణాకు తరలించారు. తిరుపతిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వసంత్‌ జాదవ్‌ హెచ్చరించారు.

మహిళ మృతిపై విచారణ

తుర్కయంజాల్‌: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతిపై పూర్తి విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్‌ రవినాయక్‌, డాక్టర్‌ భానుప్రకాశ్‌, డాక్టర్‌ వినయ్‌ కోట బృందం వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన కె.దివ్య వైద్యం నిమిత్తం ఈనెల 24న రాగన్నగూడలోని మహోనియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చి, మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈఅంశంపై విచారణ చేసేందుకు మహేశ్వరం మెడికల్‌ కళాశాలకు చెందిన వైద్య బృందాన్ని నియమించారు. సోమవారం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు దివ్యకు అందించిన చికిత్స వివరాలను సేకరించడంతో పాటు పలు రిపోర్ట్‌లను పరిశీలించారు. ఐసీయూలోని సీసీ పుటేజీలను సైతం తీసుకున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ లక్ష్మీప్రసన్న, మండల వైద్యాధికారి ప్రియాంక, డాక్టర్‌ శృతి తదితరులు పాల్గొన్నారు.

యువకుడి అదృశ్యం

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవడ గ్రామానికి చెందిన పొడుగు ఈశ్వరమ్మ, యెరుకులు దంపతులు కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా అనాజ్‌పూర్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన సహారా క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. ఫిల్మ్‌సిటీలో పనిచేస్తున్న వారి చిన్న కుమారుడు ఏసుకుమార్‌(24) ఈ నెల 21వ తేదీన పనికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూడగా ఏసుకుమార్‌ కనిపించకపోవడంతో పాటు ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రొటోకాల్‌పై

కలెక్టర్‌కు ఫిర్యాదు

మంచాల: ప్రొటోకాల్‌ పాటించకుండా పనులకు అడ్డుతగిలి, తనను అవమాన పర్చిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆగపల్లి సర్పంచ్‌ లకుమల్ల ఉమ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25న గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వచ్చారన్నారు. కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత సమయాభావంతో ఆయన వెళ్లిపోయారని, మిగిలిన వాటిని సర్పంచ్‌ ఆధ్వర్యంలో ప్రారంభించాలని సూచించారన్నారు. అనంతరం గ్రామంలో ఓ ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను ఏర్పుల సంజీవ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాలితో తన్నడంతో పాటు కత్తెర లాక్కొని రిబ్బర్‌ కట్‌ చేశారని ఆరోపించారు. ప్రొటోకాల్‌ పాటించకుండా, మహిళా సర్పంచ్‌నైన తనను అవమానించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement