ఆయుధ వినియోగంలో ప్రావీణ్యం అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆయుధ వినియోగంలో ప్రావీణ్యం అవసరం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

● ఎస్పీ స్నేహ మెహ్ర ● ఫైరింగ్‌ ప్రాక్టీస్‌లో పోలీస్‌ అధికారులు

అనంతగిరి: పోలీసు అధికారులకు ఆయుధాల వినియోగంపై పూర్తి ప్రావీణ్యం ఉండాలని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. వికారాబాద్‌ పట్టణ పరిధిలోని కొత్రేపల్లి వద్ద నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్‌ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఆయుధాల పనితీరును పరిశీలించి ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా, సమర్థవంతంగా స్పందించే సామర్థ్యం పోలీసు సిబ్బందిలో ఉండాలని ఆకాంక్షించారు. సీనియర్‌ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు తమ సిబ్బందికి ఫైరింగ్‌ ప్రాక్టీస్‌పై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. శిక్షణలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి స్పష్టంగా వివరించాలని తెలిపారు. ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. తుపాకుల దగ్గర పెట్టుకొని విధులు నిర్వహించే అధికారులు తగు జాగ్రతలు పాటించాలన్నారు. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు పోలీసుల ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ సులువవుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతి అధికారి అప్రమత్తత, క్రమశిక్షణ, సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాములునాయక్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీశ్రీనివాసులు, డీఎస్పీలు శ్రీనివాస్‌ రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్‌, వీరేష్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సామాజిక స్పృహపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సామాజిక స్పృహపై సామాజిక మాద్యమాల ద్వారా అవగాహన కల్పించేందుకు షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ స్నేహమెహ్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేఫ్‌ యూత్‌ – స్ట్రాంగ్‌ నేషన్‌ అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీదారులు ముఖ్యంగా సైబర్‌ క్రైమ్‌, డిజిటల్‌ అరెస్ట్‌ నివారణ, మహిళలు, పిల్లల రక్షణ, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన, ఏటీఎం దొంగతనాలు, ఉద్యోగాలు, బహుమతుల పేరిట మోసాలు, న్యాయ విజ్ఞానం, ఆత్మహత్యల నివారణ అవగాహన అంశాల్లో షార్ట్‌ ఫిలిమ్‌ చేయాలని తెలిపారు. వ్యవధి 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఉండాలన్నారు. జిల్లాలోని యువత, విద్యార్థులు, క్రియేటివ్‌ అర్టిస్టులు, కంటెంట్‌ క్రియేటర్లు, యూ ట్యూబర్లు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. వీడియో కేవలం వినోదం మాత్రమే కాకుండా సమాజంలో బాధ్యతను పెంచే విధంగా ఉండాలన్నారు. ఉత్తమంగా ఐదు షార్ట్‌ ఫిల్మ్‌లను ఎంపిక చేసి నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల వారు మీరు తీసిన వీడియోతో పాటు మీ పేరు, ఫోన్‌ నంబర్‌ను టైటిల్‌ను జగదీశ్వర్‌రెడ్డి సెల్‌ నంబర్‌ 9948542227కు పంపాలన్నారు. మరిన్ని వివరాలకు ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ సెల్‌ నంబర్‌లో 8712670020లో సంప్రదించాలని తెలిపారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పీఎస్‌లకు ఫోన్‌ చేసి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడానికి పోలీస్‌ శాఖ ఎల్లపుడూ అందుబాటులో ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement