ఆయుర్వేదం.. అందనంత దూరం | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదం.. అందనంత దూరం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

● డాక్టర్‌ లేక మూతపడిన వైద్యశాల ● రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్న రోగులు

దోమ: పురాతన సంప్రదాయ వైద్యం, రోగులపై దుష్ప్రభావాలు కలిగించకుండా స్వస్థత చేకూర్చే వైద్యం ఆయుర్వేదం. ప్రకృతిలో లభించే వనమూలికలతో చూర్ణాలు, లేహ్యాలు తయారు చేసి రోగ నివారణ చేసే అద్భుత వైద్య విధానంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ప్రజాభిమతాన్ని గమనించిన పాలకులు ఆయుష్‌ పేరుతో ప్రతి మండల కేంద్రంలో ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కానీ దోమ మండలంలో వైద్యులు లేక మూతబడింది. రెండేళ్ల నుంచి వైద్యం, మందుల కోసం రోగులు ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా జిల్లా అధికారుల్లో చలనం లేదు.

నిరీక్షించి.. వెనుదిరిగి..

మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి నిత్యం అనేక మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఆయుర్వేద ఆస్పత్రికి వస్తుంటారు. కానీ వైద్యుడు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ప్రైవేటును ఆశ్రయిస్తూ..

గతంలో ఆయుర్వేద ఆస్పత్రి సేవలు ఎంతో బాగుండేవి. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచేవారు. రోగులకు మెరుగైన సేవలు అందేవి.. వైద్యుడు లేని కారణంగా ఆస్పత్రి మూత పడింది. రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మందులు కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు ప్రైవేటులో వైద్యం పొంది మందులు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆస్పత్రికి వైద్యుడు, సిబ్బందిని నియమించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వైద్యం అందడం లేదు

ఆయుర్వేద ఆస్పత్రిలో డాక్టర్‌ లేక వైద్యం అందడం లేదు. ఎప్పుడు వచ్చినా ఆస్పత్రికి తాళం ఉంటోంది. రెండేళ్లుగా తిరుగుతున్నా. ప్రస్తుతం నగరానికి వెళ్లి మందులు తెచ్చుకుంటున్నా.

– ప్రభాకర్‌, బొంపల్లి

సిబ్బందిని నియమించాలి

ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బందిని నియమించాలి. డాక్టర్‌ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.

– ఖాజాపాషా, కోఆప్షన్‌ మాజీ సభ్యుడు, దోమ

Advertisement
 
Advertisement
Advertisement