వెంగళరావునగర్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా లింక రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా వెల్లంకి శ్రీనివాస్ విజయం సాధించారు. యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి వల్లభనేని అనిల్‌కుమార్, చిట్టినేని కిశోర్‌బాబులు పోటీ చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి అమ్మిరాజు కనుమిల్లి, లంక రాజేంద్రప్రసాద్, పేర్ని రాంబాబు, కోశాధికారి పదవికి జి.భీముడు(శ్రీకాంత్), వెల్లంకి శ్రీనివాస్‌కుమార్‌లు పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్ళ పాటు (2026–28) తమ పదవుల్లో కొనసాగుతారని చౌదరి తెలియజేశారు.
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
పంజగుట్ట: చాపకింద నీరులా విస్తరిస్తున్న క్యాన్సర్ విషయంలో టెస్టులే కీలకమని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధానకార్యదర్శి రమేష్ వరికుప్పల అన్నారు. ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం జర్నలిస్టులకు, వారి కుటుంబాల కోసం బసవతారకం ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. సుమారు 150 మందికి పైగా జర్నలిస్టులు ఈ పరీక్షలు చేయించుకున్నారు. పలువురు సీనియ ర్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్
ముగ్గురికి తీవ్ర గాయాలు
షాద్‌నగర్‌రూరల్: ట్రాక్టర్ అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన పట్టణంలోని హాజిపల్లి రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బుర్ల ఇసాఖ్ వసంత దంపతులు తమ కుమారుడు యశ్వంత్, కుమారై అవనీకతో కలిసి ఆదివారం బైక్‌పై చర్చికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా హాజిపల్లి రోడ్డులో వెనుకనుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుర్ల ఇసాఖ్ వసంత, కుమారై అవనీకకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వసంత తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రణయ్ తెలిపారు.
దూసుకొచ్చి ఢీ కొట్టినలారీ.. వ్యక్తి మృతి
బాలానగర్: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాదాచారిని ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బాలానగర్ నుంచి వై జంక్షన్ వైపు వెళుతున్న ఓ లారీ ఇందిరానగర్ యూటర్స్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుడు ఇందిరానగర్ నివాసి బానోత్ కిషన్ (45)గా గుర్తించారు. బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సిటీ స్విమ్మర్ మరో రికార్డు
● సముద్రాన్ని ఈదిన నగర మహిళ
● 10.10 గంటల్లో శ్రీలంక నుంచి
రామేశ్వరం చేరుకుని రికార్డు
కాచిగూడ: అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా (45) మరో రికార్డును నెలకొల్పారు. కాచిగూడకు చెందిన క్వీనీ విక్టోరియా శ్రీలంకలోని తలైమీనార్ నుంచి తమిళనాడు రామేశ్వరం ధనుస్కోడి వరకు ఐదుగురు మహిళలతో కలిసి సముద్రాన్ని ఈది రికార్డును నెలకొల్పారు. గంధం క్వీనీ విక్టోరియా సారధ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఆర్సీ (42), తెలంగాణకు చెందిన మౌనిక (34), మహారాష్ట్రకు చెందిన స్మిత (52), విజయవాడకు చెందిన ధాత్రిక మండప (48)లు మహిళలు శ్రీలంకలోని తలైమినార్‌లో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు స్విమ్మింగ్ ప్రారంభించి రామేశ్వరం ధనుస్కోడికి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకున్నారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10గంటల 10 నిమిషాలలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఐదుగురు మహిళలకు కలిసి రామసేతువును ఈడదం ఇదే మొదటిసారి.


