సర్పంచ్‌పై దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌పై దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలి

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

కొత్తూరు: జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం ఎలుకగూడెం సర్పంచ్‌ బందెయ్యపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన పలువురు సర్పంచులతో కలిసి మండలకేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులమత తారతమ్యం లేకుండా రాజ్యాంగం మేరకు దేశంలో అన్నిచోట్ల రిజర్వేషన్లు అమలవుతున్నట్లు తెలిపారు. అంబేడ్కర్‌ కృషి ఫలితంగా నేడు అన్ని వర్గాలకు చెందిన వారు రిజర్వేషన్ల కారణంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల సర్పంచ్‌ ఎన్నికల్లో బహుజన కుటుంబానికి చెందిన బందెయ్య సర్పంచుగా గెలుపొందగా ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని కొందరు గ్రామానికి చెందిన అగ్రకులాల నాయకులు దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఉద్ధేశపూర్వకంగా సర్పంచ్‌పై దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జగన్‌, దయానంద్‌గుప్తా, శ్రీశైలం, నర్సింహారెడ్డి, శ్రీరాములు, మల్లేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

కులవివక్షను ప్రోత్సహించడం తగదు

షాద్‌నగర్‌ రూరల్‌: అధికారం కోసం సర్పంచ్‌పై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సీనియర్‌ నాయకుడు నందిగామ రాంచందర్‌ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండల పరిధిలోని ఎల్కగూడ సర్పంచ్‌ బందయ్య పై అదే గ్రామానికి చెందిన రాంరెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ సమానత్వాన్ని ప్రొత్సాహిస్తుంటే గ్రామాల్లో కొందరు వ్యక్తులు ఇలాంటి దాడులతో కుల వివక్షను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. ఘటనకు కారణమైన రాంరెడ్డితో పాటు దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని కోరారు.

సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement