● ప్రభుత్వం సేకరించరాదు
● దివ్యాంగుల విన్నపం
మోమిన్‌పేట: దివ్యాంగులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని ఎలా అభివృద్ధి చేద్దామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ లబ్ధిదారులను కోరారు. శనివారం మండలంలోని ఏన్కతల గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామ సర్వే నంబర్ 174లోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిని 2004 నవంబరులో 120 మంది దివ్యాంగులకు కేటాయించినట్లు తెలిపారు. అట్టి భూమిలో పండ్ల తోటలు, కూరగాయలు, ఆకు కూరల తదితర పంటలు పండించుకొని జీవనోపాధి పొందాలని అనాడు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. అప్పట్లో సీఎల్‌డీపీ పథకం కింద రెండు బోరు బావులను తవ్వించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి భూములు పడావుగానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అట్టి పొలాల్లో పనులు చేపడుతోందని లబ్ధిదారులు అధికారి దృష్టికి తీసుకెళ్లారు. మా భూమి మాకే ఉండాలని.. ఎట్టి పరిస్థితిల్లో ప్రభుత్వం సేకరించరాదని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఆర్‌డీఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సృజన సాహిత్య, ఏపీఎం మధుకర్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.


