వికారాబాద్: ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వీయ జనగణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. నేటి(ఆదివారం) నుంచి మే 10వ తేదీ వరకు ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుందని ప్రజలు సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనిపై అధికారులు.. విద్యావంతులు అందరికీ అవగాహన కల్పించాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వీయ జనగణన గురించి వివరించారు. అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అంతకుముందు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలో ఇళ్ల మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,46,109 మంది ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత జనగణన కార్యక్రమంలో 1,773 మంది ఎన్యుమరేటర్లు, 304 మంది సూపర్ వైజర్లు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందన్నారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ కోసంhttpr://-re.cenrurవెబ్‌సైట్ ద్వారా లాగిన్ కావాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1855కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు 33 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత ఏడు అంకెలతో కూడిన సెల్ఫ్ ఐడి వస్తుందన్నారు. సమాధానాలను మరోసారి చెక్ చేసుకొని సబ్మిట్ చాయాలన్నారు.
మే 11 నుంచి..
మే 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్ల సమాచారం సేకరిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ జూన్ 9తో పూర్తవుతుందన్నారు. ఎన్యుమరేటర్లు వచ్చిన సమయంలో కూడా స్వీయ జనగణనకు అవకాశం ఉంటుందన్నారు. మనం వివరాలు నమోదు చేస్తే ఎన్యుమరేటర్లు అప్రూవ్ చేస్తారని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా తప్పులకు ఆస్కారం ఉండదన్నారు. ఈ పోర్టల్‌లో 14 రీజినల్ భాషలు ఉంటాయని ఏ భాషలోనైనా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకసారి భాషను ఎంచుకున్న తర్వాత మళ్లీ మార్చడానికి వీలుండదని తెలిపారు. ఇది పూర్తిగా సీక్రెట్ పోర్టల్ అని.. వివరాలు గోప్యంగా ఉంటాయని వివరించారు. హౌస్ హోల్డ్‌లో కుటుంబ పెద్ద ఒకరి పేరే నమోదు చేయాలన్నారు. ఒకే ఫోన్ నంబర్ పొందుపర్చాలన్నారు. లోకేషన్, మ్యాపింగ్ జాగ్రత్తగా యాడ్ చేయాలన్నారు. అందుబాటులో ఉండే మొబైన్ నంబర్‌నే పొందుపరచాలన్నారు. దేశంలో ఎక్కడి నుంచయినా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం మీ ఏరియా ఎన్యుమరేటర్‌కు కాల్ చేసి అప్రూవ్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి దండోరా వేయించటం, శానిటేషన్ వాహనాల ద్వారా ప్రచారం చేయిస్తామన్నారు. జనగణనలో ఇచ్చిన వివరాల ద్వారా రేషన్ కార్డు, పింఛన్లు లాంటివి తీసేయడం జరగదన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎన్యుమరేటర్లకు పూర్తి సరియైన వివరాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓ వాసుచంద్ర, డీపీఓ జయసుధ, డీఈఓ రేణుకాదేవి, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రవికుమార్, మాస్టర్ ట్రైనర్ రమాకాంతం తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
ఈ పోర్టల్‌లో 33 ప్రశ్నలు
ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం
సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1855కు కాల్ చేయాలి
విలేకరుల సమావేశంలో కలెక్టర్ దీపక్ తివారి


