తాండూరు టౌన్: మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాండూరు పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత నియమితులయ్యారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంఘటితానికి, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తాండూరు టౌన్: మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్, ఫిష్ వ్యర్థాల రవాణా, సైంటిఫిక్ డిస్పోజల్ ఏజెన్సీల నియామకం కోసం ఈ నెల 7న నిర్వహించిన బహిరంగ వేలాన్ని రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం దక్కించుకున్న మొదటి పాటదారుడు ఎండీ హమీద్, రెండో పాటదారుడు అబ్దుల్ రహీంలు నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో రద్దు చేసినట్లు చెప్పారు. మే 5న తిరిగి వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన ఏజెన్సీలు వివరాలతో వేలంలో పాల్గొనాలని కోరారు.
అనంతగిరి: ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో శనివారం ఉదయం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై సానుకూలంగా వ్యవహరించడంతో వికారాబాద్ డిపోలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి కార్మికులు, ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఎం నమ్రత, డ్రైవర్లు, కండక్టర్లు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.


