● మురుగు నిల్వ ఉండకుండా చూడాలి
● కీటక జనిత వ్యాధుల నిర్మూలన జిల్లా అధికారి రవీంద్ర యాదవ్
కొడంగల్ రూరల్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని కీటక జనిత వ్యాధుల నిర్మూలన జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంతు కుమార్‌తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సివిల్ హాస్పిటల్‌లో నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బందికి మలేరియా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు అందించారు. దోమల పుట్టుక వాటి స్థావరాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలన్నారు. నిల్వ ఉన్న నీటిని పారబోసి కొత్త నీటిని వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యం, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బుస్రా ఫాతిమా, డాక్టర్ రోహిణి, సబ్ యూనిట్ ఆఫీసర్ పకిరప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణలత, వైద్య సిబ్బంది గీత, వాత్సల్య, విక్టోరియా, నర్సింగ్ విద్యార్థులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


