అనంతగిరి: మీడియా అక్రిడిటేషన్ నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్ దీపక్ తివారి సమావేశమయ్యారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, జీఓ నంబర్ 252 ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మీడియా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తారని, కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి చెన్నమ్మ, కమిటీ సభ్యులు రవి శంకర్, రఘు, మల్లేశం, ప్రహ్లాదచారి, పాపిరెడ్డి, శ్రీనివాస్, ఏపీఆర్‌ఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


