ధారూరు: టైర్ పేలి, ట్రాలీ నుంచి విడిపోయి ట్రాక్టర్ వంతెనపై నుంచి కింద పడింది. ఈ సంఘటన మండల పరిధి రుద్రారం– నాగసమందర్ గ్రామాల మధ్య వంతెన వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధారూరు గ్రామానికి చెందిన చంద్రయ్య బంట్వారం మండలం బస్వాపూర్ నుంచి ఎర్రరాయి లోడుతో వస్తున్నాడు. రుద్రారం– నాగసమందర్‌ల మధ్య ప్రాజెక్టు అలుగునీరు ప్రవహించే రోడ్డు వంతెన వద్ద ట్రాక్టర్ ముందటి టైర్ పగిలిపోయింది. దీంతో ట్రాలీ నుంచి ఇంజన్ భాగం విడిపోయి అదపు తప్పి వంతెన పైనుంచి కింద పడింది. ఈ సంఘటలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ట్రాక్టర్‌ను జేసీబీ సాయంతో బయటకు తీశారు.
గడ్డివాము,పశువులపాక దగ్ధం
దౌల్తాబాద్: మండల కేంద్రంలో శనివారం ప్రమాదవశాత్తు గడ్డివాము, పశువులపాక దగ్ధం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుర్వ ముత్యప్ప తన ఇంటి దగ్గర పశువులపాక, గడ్డివాము వేసుకున్నాడు. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే కొడంగల్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు మంటలను చల్లార్చారు. అప్పటికే పాక, గడ్డివాము కాలి బూడిదయ్యాయి.
జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరు
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి హక్కుల సాధనే ధ్యేయంగా రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని నేషనల్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ) నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ అధ్యక్షతన నగరంలో జరిగిన సదస్సు శనివారం ముగిసింది. జర్నలిస్టుల భద్రత, హక్కుల సాధనపై కీలక తీర్మానాలు చేశారు. మొదటి రోజు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రెండవ రోజు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా తదితర జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలపై నిరసన
ఇబ్రహీంపట్నం: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌తో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రజావాణిలో సోమవారం వినతిపత్రాలను అందజేస్తామని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష పోస్టు కార్డులతో మంగళవారం ఫిర్యాదులు చేస్తామని, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.


