తాగుతూ.. ఊగుతూ..! | - | Sakshi
Sakshi News home page

తాగుతూ.. ఊగుతూ..!

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

అఽధిక ధరలకు..

గ్రామాల్లో యథేచ్ఛగా బెల్ట్‌షాపులు

వికారాబాద్‌: పచ్చని పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో కిరాణా దుకాణం లేని గల్లీ ఉంటుందేమో కానీ బెల్టు షాపు లేని వీధంటూ కనిపించడంలేదు. పాల ప్యాకెట్‌ దొరకని ఊర్లో కూడా మద్యం కావాల్సినంత దొరుకుతోంది. ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయాల బోర్టుల్లో మాత్రం మద్య నిషేధ నియంత్రణ శాఖ అని రాసి ఉంటుంది.. కానీ వాస్తవంలో అమలు కావడం లేదు. ఉన్నతాధికారులు టార్గెట్లు విధిస్తుండటంతో కిందిస్థాయి అధికారులు మద్యం దుకాణారులను ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉండగా వైన్‌ షాపు యజమానులు నెలనెలా మామూళ్లు ఇస్తుండటంతో ఎకై ్సజ్‌ శాఖ అధికారులు బెల్టు షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సివిల్‌ పోలీసులకు సైతం వాటాలు అందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మందుబాబుల కారణంగా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిసింది. అయినా అధికారులు బెల్టు షాపుల జోలికి వెళ్లడంలేదు. జిల్లాలో 586 గ్రామ పంచాయతీలు ఉండగా 900 పైచిలుకు ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో ఆవాస ప్రాంతంలో రెండు నుంచి 12 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు తెలిసింది.

విచ్చలవిడిగా..

గ్రామాల్లో మద్యం విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎకై ్సజ్‌ అధికారులే బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. సారాను కట్టిడి చేయడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. మెజార్టీ కిరాణా దుకాణాల్లో మద్యం లభిస్తోంది. ఒక్కో ఎకై ్సజ్‌ ఠాణా పరిధిలో 400 వరకు బెల్టు షాపులు ఉన్నట్లు అంచనా. జిల్లాలో 59 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 వేలకు పైగా బెల్టు షాపులు కొనసాగుతున్నట్లు తెలిసింది. డాబాల్లో విక్రయాలు అదనం. మద్యం దుకాణాల్లో గిరాకి 30 శాతం ఉంటే బెల్టు షాపుల్లో 70 శాతం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే గ్రామాల్లో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో ఉన్నయో ఇట్టే తెలిసిపోతుంది. గతంలో మద్యం దుకాణాల్లో రోజుకు రూ.లక్ష అమ్మకాలు జరిగేవి.. బెల్టు షాపుల కారణంగా నేడు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు దాటి సేల్స్‌ ఉంటున్నాయి.

● వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని గెర్‌గేట్‌పల్లి గ్రామంలో 800 పైచిలుకు జనాభా ఉంది. గతంలో ఏడు బెల్టు షాపులు ఉండేవి. మద్యం మత్తులో భార్యభర్తలు గొడవలకు దిగటం.. అదే మత్తులో పురుగు మందు సేవించి తునువు చాలించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల క్రితం స్థానికులు, గ్రామ పెద్దలు సమావేశమై మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేశారు. ఎవరైనా విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆరు నెలలుగా మద్యం అమ్మకాలు బందయ్యాయి. గెర్‌గేట్‌పల్లి తరహాలోనే మరి కొన్ని గ్రామాలు ముందుకు సాగుతున్నాయి.

● పరిగి మండలం గడిసింగాపూర్‌ గ్రామంలో రెండు వేల పైచిలుకు జనాభా ఉంది. ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు, దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులే ఉంటారు. ఈ గ్రామంలో 12 బెల్టు షాపులు ఉండగా గ్రామస్తులు సంపాదించిన దాంట్లో ఎక్కువ డబ్బు మద్యానికే తగలేస్తున్నారు. రోజుకు సగటున ఈ గ్రామంలో రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు గ్రామస్తులు మద్యం కోసం ఖర్చు చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

మెజార్టీ కిరాణా దుకాణాల్లో మద్యం విక్రయాలు

ఒక్కో బాటిల్‌కు అదనంగా వసూలు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఎకై ్సజ్‌ అధికారులు

తండాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో గుడుంబాను కట్టడి చేసిన ఎకై ్సజ్‌ అధికారులు బెల్టు షాపుల నియంత్రణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒకవేళ అధికారుల దాడుల్లో బెల్టు షాపు నిర్వాహకులు పట్టుబడితే సదరు వైన్‌ షాప్‌ యజమాని వారికి రక్షణగా నిలుస్తున్నారు. కేసులు కాకుండా చూస్తుకుంటున్నారు. దీంతో బెల్టు షాపుల నిర్వాహకులు ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement