పరిగి: ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం కార్మికులు డిపో ఎదుట ముఖానికి నల్ల గుడ్డ కట్టుకొని నిరసన తెలిపారు. ఆర్టీసీ అధికారులు పోలీసుల బందోబస్తుతో కొన్ని బస్సులు నడిపారు. ముందుగా ఆత్మబలిదానం చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన స్ఫూర్తితో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆయన ఆశయాలు నెరవేరేవరకు వెనకడుగు వేయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఒకలా.. వచ్చాక ఒకలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బంది పెడితే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో గద్దె నెక్కిన కాంగ్రెస్ మళ్లీ కార్మికుల కారణంగా అధికారం కోల్పోవడం ఖాయమన్నారు.
చర్చల పేరుతో కాలయాపన
అనంతగిరి: చర్చల పేరుతో కాలయాపన చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఉదయం వికారాబాద్ డిపో వద్ద ఆత్మహత్య చేసుకున్న శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నోటికి క్లాత్ కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు ప్రైవేటు డ్రైవర్లతో కొన్ని బస్సులను నడిపారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
భోజనం కూడా పెట్టనివ్వరా..!
తాండూరు రూరల్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాండూరులో పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు మండిపడ్డారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులకు సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు భోజనం పెటేందుకు వస్తే పోలీసులు వారిని హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తాండూరు పట్టణంలోని కార్మికుల చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు సోమశేఖర్, శ్రీనివాస్, అంజలయ్య, అబ్దుల్ వహాబ్, చంద్రయ్య, శ్రీనివాస్, సాదిక్, నవీన్‌గౌడ్, బాష, సుదర్శన్, మోదీన్, పీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
మూడో రోజుకు చేరిన సమ్మె


