కుల్కచర్ల: భార్య ప్రసూ తి కోసం నగదు అవసరమై బయటకు వెళ్లిన వ్యక్తి విగత జీవిగా మారిన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బిందెంగడ్డ పంచాయతీ అనుబంధ గ్రామం చింతల్‌కుంటతండాకు చెందిన శ్రీనునాయక్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన భార్య ప్రసవం కోసం అవసరమైన డబ్బు సమకూర్చుకునేందుకు బైక్‌పై తెలిసిన వారి వద్దకు బయల్దేరాడు. ఈక్రమంలో మహ్మదాబాద్ మండలం మొకర్లాబాద్ శివారులో బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు.
రౌడీషీటర్‌కు రిమాండ్
ఆమనగల్లు: ఓ వ్యక్తిని బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్‌ను పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. పట్టణానికి చెందిన రౌడీషీటర్ నేనావత్ పవన్‌కల్యాణ్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తిని బెదిరించి అతని బైక్‌ను ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి వద్ద పోలీసులను చూసిన నేనావత్ పవన్‌కల్యాణ్ బైక్‌తో పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడిపై ఆమనగల్లు, మాడ్గుల, అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లలో పదికి పైగా కేసు ఉన్నాయని తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన స్కూటీ
యువకుడి దుర్మరణం
షాద్‌నగర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎలికట్ట శివారులో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాంచందర్ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని అంబేడ్కర్‌కాలనీకి చెందిన సవాళ్ల స్వామి(23) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఫోన్ రావడంతో మళ్లీ వస్తాననిచెప్పి స్కూటీపై బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో ఎలికట్ట శివారులోని భారత్ పెట్రోల్‌పంపు సమీపంలో స్కూటీ అదుపు తప్పడి చెట్టును ఢీకొట్టింది. దీంతో స్వామి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఉదయం విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఎస్‌ఐ రాంచందర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష
బాలానగర్: చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్ని ంచిన కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కూకట్‌పల్లిలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించారు. 2017లో బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన నిందితుడు కొర్ర శివశంకర్ అలియాస్ రాజు (41) యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని ఎల్.ఎన్.నగర్‌లో నివసించేవాడు. నిందితుడు ఒక చిన్నారిపై లైంగిక దాడికి యత్నించడంతో పాటు, ఆమెను అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు పోక్సో చట్టం, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 10వేల జరిమానా విధించారు.
కారు బోల్తా
బంజారాహిల్స్: అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ బెంజ్ కారు ఫుట్‌పాత్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–79 పద్మాలయా స్టూడియో వైపు నుంచి ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన బెంజ్ కారు వేగంగా దూసుకొస్తూ మలుపు వద్ద అదుపుతప్పింది. స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఫుట్‌పాత్‌ను ఢీకొట్టగా బొల్తా పడింది. అందులో నుంచి ఓ యువకుడు దిగి పరారయ్యాడు. టెంపరరీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ కారు ఎవరిదనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును పక్కకు జరిపారు. కారులో ఒక్కరే ఉన్నారా.. ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


