రెండో రోజూ కదలని బస్సులు | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ కదలని బస్సులు

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు సమ్మెకు మద్దతు పలికిన బీఆర్‌ఎస్‌ తాండూరు బస్టాండులోభారీ బందోబస్తు టెంటు పీకేసిన పోలీసులు చెట్టు నీడన నిరసన తెలిపిన కార్మికులు

తాండూరు టౌన్‌: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో రెండో రోజుకు చేరింది. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవే టు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాండూరు బస్టాండ్‌లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో ఎదుట కార్మికులు వేసిన టెంటును పోలీసులు తొలగించారు. సమ్మె చేయరాదని హెచ్చరించారు. టెంట్లు, కుర్చీలు ఇతర సామగ్రి ఇచ్చే వ్యాపారులపై చర్యలు ఉంటాయన్నారు. టెంట్‌ హౌస్‌ యజమానిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్‌ తెలిపారు. దీంతో కార్మికులు చెట్టు నీడన కూర్చుని సమ్మెను కొనసాగించారు. పోలీసుల తీరుపై టీజేఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సోమశేఖర్‌ అసహనం వ్యక్తం చేశారు. సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు మద్దతు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శ్రీశైల్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమ్మె శిబిరంలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అబద్దాలు చెప్పడం సిగ్గు చేటన్నారు. కార్మికులు వేసుకున్న టెంటును పీకేసి, యజమానిపై కేసు నమోదు చేయడం హక్కుల ఉల్లంఘనే అన్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్తామని, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌ గౌడ్‌, సిద్రాల శ్రీనివాస్‌, ఇర్షాద్‌, జావేద్‌, సురేష్‌, రుద్రు, వెంకట్‌ రెడ్డి, దత్తు తదితరులు పాల్గొన్నారు.

కొన్ని రూట్లలో సర్వీసులు

సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో హైదరాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, చించోళి, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు కొన్ని సర్వీసులు నడిపారు. కండక్టర్‌ లేకుండానే బస్సులు తిరిగాయి. పురుషులకు సైతం పూర్తి ఉచితంగా ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. అయితే అన్ని మార్గాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

Advertisement
 
Advertisement
Advertisement