సీఎంవి కక్ష సాధింపు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీఎంవి కక్ష సాధింపు చర్యలు

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

● హై కోర్టు తీర్పు కాంగ్రెస్‌కు గుణపాఠం ● అటకెక్కిన ఆరు గ్యారంటీలు ● రెండు ఎకరాలకే రైతు బంధు ● కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌: హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం లాంటిదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నివేదికను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. తప్పుడు నివేదిక ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను సీఎం తప్పుదోవ పట్టించారని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని పెద్ద సమస్యగా సృష్టించి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీ వారు ఉచితంగా మరమ్మతులు చేస్తామని ముందుకు వస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎకరానికి రూ.15వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు వితంతులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్‌ ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదన్నారు. పగ్గాలు చేపట్టి రెండున్నర ఏండ్లు గడిచినా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ జాడలేదన్నారు. తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా వందశాతం రైతు బంధు రాలేదన్నారు. కాంగ్రెస్‌ పాలన ఇలాగే కొనసాగితే బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీ ఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, నాయకులు మధు యాదవ్‌, భీములు, నారాయణరెడ్డి, దయాకర్‌రెడ్డి, నరేష్‌గౌడ్‌, విష్ణువర్థన్‌, మహిపాల్‌, వెంకట్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement