లంచనమే! | - | Sakshi
Sakshi News home page

లంచనమే!

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

● గతేడాది డిసెంబర్‌లో తాండూరు తహసీల్దార్‌, ఆర్‌ఐ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ● పైఘటన జరిగి రెండు నెలలు కూడా తిరగముందే ధారూరు ఎస్‌ఐ, అతని డ్రైవర్‌ ఏసీబీకి చిక్కారు. ● ఐదు నెలల క్రితం కలెక్టర్‌ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్‌లో విధులు నిర్వహించే ఓ మహిళా ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ● పెద్దేముల్‌ ఆర్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ● గతంలో తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌, పరిగి ఎంపీడీఓ, ఈజీఎస్‌ ఉద్యోగులు, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్‌, వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఓ పోలీసు అధికారి, వికారాబాద్‌లో ఓ ఇంజనీర్‌ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

రెవెన్యూ, పోలీసు శాఖల్లోనే కేసులు అధికం పురుషులతో పోటీపడుతున్న మహిళా అధికారులు ఆరు నెలల్లో ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఆఫీసర్లు

ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పలువురుఅధికారులు తరచూ అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నా.. యంత్రాంగంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన తోటి ఉద్యోగులు అభాసు పాలవుతున్నా.. పక్కనున్న వారు జంకడం లేదు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న ఆఫీసర్లు.. వారి పనులు చేసేందుకు మాత్రం లంచం..లాంఛనమే అనేలా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన వారికి కఠినమైన శిక్షలు అమలుకాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

వికారాబాద్‌: గడిచిన ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా నమోదైన అవినీతి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిలో పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో కేవలం పురుష అధికారులే పట్టుబడేవారు. ఇటీవల మహిళా ఉద్యోగులు సైతం లంచం డిమాండ్‌ చేస్తూ దొరికిపోతున్నారు. ఏడాది కాలంలో ఆరుగురు అధికారులు ఏసీబీకి చిక్కగా, వీరిలో ముగ్గురు మహిళలే ఉండటం విస్మయం కలిగిస్తోంది. తాజా గా గత మంగళవారం ఇద్దరు మహిళా పోలీసు ఆఫీసర్లు ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది.

ఆధారాలతో అదుపులోకి..

తాజాగా వికారాబాద్‌ మహిళా పీఎస్‌ సీఐ, ఎస్‌ఐలు ఏసీబీకి పట్టుబడిన ఘటన గతంలో జరిగిన వాటికి పూర్తి భిన్నంగా ఉంది. సాధారణంగా ఏ కేసులో అయినా ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. కానీ ఈ కేసులో లంచం తీసుకున్నట్లుగా ఏసీబీ వద్ద ఆధారాలున్నప్పటికీ నగదుతో పట్టుబడలేదు. దీంతో అధికారులు సగమే చిక్కారనే చర్చ సాగుతోంది. లంచం ఇచ్చిన వ్యక్తి తీసిన వీడియోలు, మాట్లాడిన ఫోన్‌ సంభాషణలను ఏసీబీకి అందించాడు. వీటి ఆధారంగా ఈనెల 21న సీఐ, ఎస్‌ని అదుపులోకి తీసుకుని 22న ఉదయం వరకూ విచారించారు. అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 25న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇలా ఏసీబీ అధికారులు పట్టుకుని తిరిగి వదిలేసి వెళ్లటం జిల్లాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా మారింది.

ఆరోపణలు కోకొల్లలు

వికారాబాద్‌తో పాటు పరిగి, కొడంగల్‌, తాండూరు సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న కొందరు ఎస్‌హెచ్‌ఓలతో పాటు పర్యవేక్షణాధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిగి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ బోరు బండిని పట్టుకుని వదిలేసిన కేసులో, రేసింగుకు వినియోగించే పావురాలను పట్టుకున్న కేసులోనూ పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్టు ప్రచారం జరుగుతోంది. మిషన్‌ భగీరథ పైపుల దొంగతనం కేసులోనూ పరిగి పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చన్గొముల్‌ ఎస్‌హెచ్‌ఓపై అనేక విమర్శలు వచ్చాయి. రోజువారీ కేసుల నమోదులో వచ్చే మామూళ్లతో పాటు కొందరు ఎస్‌హెచ్‌ఓలు నెలవారీ బేరా లు మాట్లాడుకుని దందా నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా రేషన్‌ బియ్యం, కిరోసిన్‌, ఇసుక, మట్టి, కలప అక్రమ రవాణా, మద్యం, బెల్టు దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

జిల్లాలో కేసులు ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement